
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఏర్పాట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. భారత్ ఫ్యూచర్ సిటీలో జరుగుతున్న ఏర్పాట్ల పురోగతిని విపులంగా సమీక్షించిన ఆయన, అధికారులు ఏ చిన్న విషయాన్నీ నిర్లక్ష్యం చేయకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో భారీ స్థాయిలో ఈ సమ్మిట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రపంచవ్యాప్తంగా ఉన్నతస్థాయి ప్రతినిధులు, పలు దేశాల అంబాసిడర్లు, వ్యాపార, పెట్టుబడి వర్గాలు తరలివచ్చే అవకాశం ఉన్నందున, రాష్ట్ర ప్రతిష్టకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.మీర్‌ఖాన్‌పేట్ ప్రాంతంలో జరుగుతున్న ప్రాంగణ అభివృద్ధి పనులను పరిశీలించిన తరువాత, అక్కడే అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి, విదేశీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని సూచించారు. వసతి, రవాణా, అనుమతులు, అతిథి నిర్వహణ వంటి ప్రతి అంశంలో స్పష్టమైన బాధ్యతలు కేటాయించి సమన్వయంతో ముందుకు సాగాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.
సమ్మిట్ ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ, పాసులు లేని వ్యక్తులకు ప్రవేశం పూర్తిగా నిషేధించాలని సీఎం తెలిపారు. శాఖల వారీగా గుర్తించిన అధికారులకు మాత్రమే ఎంట్రీ ఉండేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ వ్యవస్థ ఏర్పాటు చేయాలని చెప్పారు. పార్కింగ్ స్థలాలు, వాహనాల మార్గదర్శక పథకాలు, బందోబస్తులో పాల్గొనే పోలీసు సిబ్బందికి ఇబ్బందులు రాకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.
అదే సందర్భంగా, భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్మాణం జరుగుతున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పనులను కూడా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్ తరాలకు నైపుణ్యాభివృద్ధిలో మార్గదర్శకంగా నిలుస్తుందనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణను పరిశ్రమలు, ఆవిష్కరణలు, నైపుణ్యాల కేంద్రంగా మార్చాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగానే ఈ సమ్మిట్ నిర్వహణ జరుగుతోందని తెలిపారు.ఈ పర్యటనలో పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రితో కలిసి ఉన్నారు. ప్రభుత్వ ప్రతిష్టలో ఉన్న నేపథ్యంలో, తెలంగాణను గ్లోబల్ వేదికపై మరొకసారి నిలిపే ఈ సమ్మిట్ రాష్ట్ర అభివృద్ధి దిశగా కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు.
