Let's talk: editor@tmv.in
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు భారీ ఏర్పాట్లు

Pinjari Chand
30 నవంబర్, 2025

ఉజ్వల తెలంగాణలో పాలుపంచుకోవాలని, తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే సమ్మిట్ కు తరలిరావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025కు ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో హైదరాబాద్‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న ఈ అంతర్జాతీయ సదస్సుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర, ట్రంప్ మీడియా డైరెక్టర్ ఎరిక్ స్విడర్, యూఏఈ రాయల్ ఫ్యామిలీ సభ్యులు, డాయిచ్ బోర్సే గ్రూప్ హెడ్ లుడ్విగ్ హైన్జెల్‌మన్ తదితరులు హాజరుకానున్నట్లు ధృవీకరించారు. దేశ-విదేశాలకు చెందిన సుమారు 3 వేల మంది పారిశ్రామికవేత్తలు, టెక్ సీఈఓలు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులకు ప్రభుత్వం ఆహ్వాన పత్రికలు పంపింది.

సమ్మిట్‌లో 70 కొత్త గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్ల (జీసీసీ) ప్రారంభం, రౌండ్ టేబుల్ చర్చలు, గిన్నిస్ రికార్డు డ్రోన్ షో కూడా ఉంటాయి. డిసెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ దార్శనిక పత్రాన్ని ఆవిష్కరిస్తారు. ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ, ఏఐ సిటీ, బుల్లెట్ ట్రైన్ గ్రిడ్, నెట్ జీరో రాష్ట్రం వంటి లక్ష్యాలతో రూపొందిన ఈ డాక్యుమెంట్ ‘వికసిత్ భారత్-2047’కు అనుగుణంగా ఉంటుంది.

హైదరాబాద్‌కు మెస్సీ

సమ్మిట్ ముగింపు కార్యక్రమానికి ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, ఎనిమిది బాలన్ డి’ఓర్ విజేత లయనల్ మెస్సీ డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ‘మెస్సీ 10 వర్సెస్ రేవంత్ రెడ్డి 9’ పేరిట సెలబ్రిటీ ఫుట్‌బాల్ మ్యాచ్, మాస్టర్‌క్లాస్ జరగనున్నాయి. మెస్సీని తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అంబాసిడర్‌గా నియమించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. సమ్మిట్ అనంతరం నాలుగు రోజుల పాటు సామాన్య ప్రజల కోసం ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫైర్‌వర్క్స్, ఫుడ్ కార్నివల్ ఉంటాయి. ఈ సమ్మిట్‌తో తెలంగాణను ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మారుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.