Let's talk: editor@tmv.in
తెలంగాణ రాష్ట్రంలో 1,200కు చేరిన వీధి కుక్కల మృతి

తెలంగాణ రాష్ట్రంలో 1,200కు చేరిన వీధి కుక్కల మృతి

Gaddamidi Naveen
29 జనవరి, 2026

తెలంగాణలో వీధికుక్కలపై సాగుతున్న అమానుష హత్యల పరంపర ఆగడం లేదు. నాగర్‌కర్నూల్ జిల్లా తిమ్మాయిపల్లి గ్రామంలో సుమారు 100 వీధికుక్కలను హత మార్చిన ఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగింది. 2025 డిసెంబర్‌ నుంచి ఇప్పటివరకు తెలంగాణలో హతమైన వీధికుక్కల సంఖ్య 1,200కి చేరిందని జంతు ప్రేమికులు ఆరోపిస్తున్నారు.

తాజా ఘటనపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. గ్రామ సర్పంచ్ కుమారుడు సహా ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు చరకొండ పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. స్ట్రే అనిమల్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన జంతు సంక్షేమ కార్యకర్త ఎం. ప్రీతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు.

ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, దాదాపు పది రోజుల క్రితం తిమ్మాయిపల్లి గ్రామంలో రూ.18,000 చెల్లించి కుక్కలను చంపే వ్యక్తులను నియమించారు. వీధికుక్కలకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చి వాటిని హతమార్చిన అనంతరం, గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో పూడ్చిపెట్టారని ఆరోపించారు. ఈ దారుణ ఘటన వెనుక గ్రామ సర్పంచ్‌తో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి పాత్ర ఉందని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

పోలీసుల సమాచారం ప్రకారం, ఇప్పటివరకు 12 కుక్కల కళేబరాలు మాత్రమే వెలికితీయగలిగారు. మిగిలిన ఘటనపై లోతైన దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. సర్పంచ్ కుమారుడితో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శి, మరో గ్రామస్తుడిపై భారతీయ న్యాయ సంహిత జంతు క్రూరత్వ నివారణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ఇటీవల డిసెంబర్‌, జనవరి నెలల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇలాంటి సామూహిక వీధికుక్కల హత్యలు చోటుచేసుకున్నాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ముందు వీధికుక్కల సమస్యను పరిష్కరిస్తామంటూ గ్రామస్తులకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఇలా చేసి ఉండవచ్చని జంతు ప్రేమికులు అనుమానిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సిద్ధిపేట జిల్లా బొప్పాపూర్ గ్రామంలో 50 వీధికుక్కలను పట్టుకుని అటవీ ప్రాంతానికి తరలించిన ఘటనపై కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది చట్టవిరుద్ధమని పేర్కొంటూ గ్రామ సర్పంచ్‌, కార్యదర్శిపై కఠిన చర్యలు తీసుకోవాలని జంతు సంక్షేమ జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. వీధికుక్కల హత్యలపై ప్రభుత్వం కఠినంగా స్పందించాలని, బాధ్యులపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ పెరుగుతోంది.