
తెలంగాణ రాజ్‌భవన్ పేరు ఇకపై ‘లోక్ భవన్’
తెలంగాణ గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్‌భవన్‌కు కొత్తగా “లోక్ భవన్” అనే పేరు నిర్ణయించారు. మంగళవారం నుంచి ఈ కొత్త పేరును అధికారికంగా అమల్లోకి తీసుకువచ్చినట్లు గవర్నర్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.
ప్రకటనలో “ఇప్పటి నుంచి ‘రాజ్ భవన్, తెలంగాణ’ స్థానంలో ‘లోక్ భవన్, తెలంగాణ’ అనే నామకరణం అన్ని ప్రభుత్వ పనుల్లో, సంబంధిత దస్త్రాల్లో, రికార్డుల్లో అమలు చేయబడుతుంది” అని పేర్కొన్నారు. ఈ మార్పు దేశ ప్రజాస్వామ్య పరమైన విలువల బలాన్ని, చైతన్యాన్ని పునరుద్ఘాటించడానికి, వికసిత్ భారత్ వైపు ముందుకు సాగుతున్న ఈ దశలో ప్రజాకేంద్రీకృత వ్యవస్థను ప్రతిబింబించేందుకు చేపట్టిన చర్యగా అధికారులు వివరించారు.
దేశవ్యాప్తంగా ఉన్న రాజ్‌భవన్‌లను లోక్ భవన్ గా, లెఫ్టినెంట్ గవర్నర్ అధికారిక నివాసం అయిన రాజ్ నివాస్‌లను లోక్ నివాస్ గా మార్చాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఈ పేరు మార్పు జరిగింది.
