Let's talk: editor@tmv.in
తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషనే’: కేటీఆర్
తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషనే’: కేటీఆర్
తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషనే’: కేటీఆర్

తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషనే’: కేటీఆర్

Gaddamidi Naveen
19 జులై, 2026

యూత్ డిక్లరేషన్ పేరుతో తెలంగాణ నిరుద్యోగ యువతను దారుణంగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ఇక ‘డెత్ డిక్లరేషన్’ రాయడానికి యువత సిద్ధంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. సరూర్‌నగర్ స్టేడియంలో నిర్వహించిన భారీ ‘యువజన సంగ్రామ సదస్సు’లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై కాంగ్రెస్ ప్రభుత్వంపై గర్జించారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే వేదికపై ప్రియాంక‌ గాంధీ చేతుల మీదుగా కాంగ్రెస్ ఒక బురిడీ పత్రాన్ని ఆవిష్కరించిందని, ఇప్పుడు అదే స్థలం నుంచి నిరుద్యోగులు కాంగ్రెస్ మోసాలను గ్రహించి గుణపాఠం చెప్పబోతున్నారని స్పష్టం చేశారు.

రాహుల్ గాంధీ ‘మొహబ్బత్ కీ దుకాన్’ ద్రోహుల ఇల్లుగా మారింది

ఈ సందర్భంగా కేటీఆర్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకుని హిందీలో మాట్లాడారు. రాహుల్ గాంధీ.. మీకు తెలుగు రాదు కాబట్టి ఇక్కడి తెలంగాణ యువత పడుతున్న ఆవేదన మీకు అర్థం కాదు. అందుకే మీకు బాగా అర్థమయ్యే మీ హిందీ భాషలోనే అడుగుతున్నా. ఎన్నికల ముందు అశోక్ నగర్ చౌరస్తాలో ఛాయ్ తాగుతూ నిరుద్యోగులతో దిగిన ఫోటోలు, ఇచ్చిన జూటా హామీలు గుర్తున్నాయా? మీరు ప్రచారం చేసుకునే ‘మొహబ్బత్ కీ దుకాన్’ (ప్రేమ దుకాణం) తెలంగాణ యువత పాలిట ‘గద్దారీ కా మకాన్’ (ద్రోహుల ఇల్లు) గా మారిందని కేటీఆర్ విమర్శించారు. దేశమంతా రాజ్యాంగం పట్టుకుని తిరిగే రాహుల్ గాంధీ, తెలంగాణలో నిరుద్యోగుల వీపులపై లాఠీలు మోగుతుంటే, ఆడబిడ్డలను అక్రమ కేసులతో వేధిస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రాష్ట్రంలో ఇందిరాగాంధీ నాటి ఎమర్జెన్సీ కాలాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ గుర్తుకు తెస్తోందని మండిపడ్డారు.

నోటిఫికేషన్లు లేవు.. అన్నీ లూటీఫికేషన్లే

ఎన్నికల సమయంలో ‘ఓటు కొట్టు.. జాబ్ పట్టు’ అని ఫుల్ పేజ్ ప్రకటనలు ఇచ్చిన కాంగ్రెస్, నేడు ఏడాది దాటినా జాబ్ క్యాలెండర్ ఊసే ఎత్తడం లేదని కేటీఆర్ ఆరోపించారు. మొదటి ఏడాదిలోనే ఇస్తామన్న 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, రూ. 4,000 నిరుద్యోగ భృతి, కాలేజీ అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, రూ. 10 లక్షల వడ్డీ లేని రుణాలు వంటి 24 హామీలలో ఒక్కటైనా నెరవేరిందా అని ప్రశ్నించారు. కొలువులు అడిగితే "ఎండ్రిన్ తాగి చావండి, బావిలో దూకండి" అని మాట్లాడిన రేవంత్ రెడ్డి అహంకారానికి తగిన సమయంలో నిరుద్యోగులు, వారి తల్లిదండ్రులు ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు రావడం లేదు కానీ, రేవంత్ రెడ్డి బినామీల బీరువాలు నిండుతున్నాయని, ఢిల్లీలో రాహుల్ గాంధీ జేబులు నింపే ‘లూటీఫికేషన్’ (దోపిడీ) స్కాములు సాగుతున్నాయని ఎద్దేవా చేశారు. గ్రూప్-1, డీఎస్సీ అభ్యర్థులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేటీఆర్ బహిరంగ సవాల్

బీఆర్ఎస్ హయాంలో భర్తీ చేసిన ఉద్యోగాలను తమ ఖాతాలో వేసుకుంటూ రేవంత్ రెడ్డి క్రెడిట్ చోరీ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నోటిఫికేషన్లు ఇచ్చి 70 వేల ఉద్యోగాలు భర్తీ చేసినట్లు రుజువు చేస్తే తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బహిరంగ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో 1,62,000 ఉద్యోగాల భర్తీ పూర్తి చేసి, మొత్తం 2,32,000 ఉద్యోగాల ప్రక్రియను ప్రారంభించామని, ఎప్పుడూ తాము సభలు పెట్టి ప్రచారం చేసుకోలేదన్నారు. గతంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్‌ను తమ ప్రభుత్వమే పట్టుకుందని, ఒకవేళ గతంలో ఏవైనా తప్పులు జరిగి ఉంటే వాటిని సవరించుకుంటామని తెలిపారు.

బీఆర్ఎస్ ఎన్నడూ విద్యార్థులను కేసుల్లో ఇరికించి రాజ్యాంగ విరుద్ధమైన విద్వంసాలకు పిలుపు ఇవ్వదని, కేవలం ప్రజాస్వామ్యయుతంగానే పోరాడుతుందని స్పష్టం చేశారు. తాను స్వయంగా ఎన్నో పరీక్షలు రాసి పూణే, న్యూయార్క్ యూనివర్సిటీల్లో సీట్లు సాధించి ఉద్యోగం చేసిన వ్యక్తినని, కాబట్టి నిరుద్యోగుల ఆకలి, కష్టాలు తనకు తెలుసన్నారు. ఒక్క రోజు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నించని రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వారు విద్యార్థులపై అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2028లో ఖచ్చితంగా మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని, రాబోయే ప్రభుత్వంలో యువత ఆకాంక్షలను ఒక అన్నగా నెరవేర్చే బాధ్యత తనదని కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగానే, టీ-హబ్ స్టార్టప్ అయిన స్కైరూట్ సంస్థ సాధించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగ విజయాన్ని అందరూ అభినందించాలని కేటీఆర్ కోరారు.

ట్యాగ్‌లు
KTRKTBRSTelanganaTelanganaYouthYouthSangramaSabhaSaroornagarRahulGandhiCongressYouthDeclarationJobsForYouth
తెలంగాణ యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు ‘డెత్ డిక్లరేషనే’: కేటీఆర్ - Tholi Paluku