Let's talk: editor@tmv.in
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన

Gaddamidi Naveen
12 జనవరి, 2026

తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. శనివారం ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలను స్వాగతించిన జనసేన, ఈ ఎన్నికల ద్వారా రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో కొన్ని నియోజకవర్గాలకే పరిమితమైన జనసేన, ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. అభ్యర్థుల ఎంపిక పొత్తుల విషయంలో త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పార్టీని బలోపేతం చేసేలా వివిధ స్థాయిల్లో కమిటీల ఏర్పాటు ప్రక్రియను జనసేన ప్రారంభించింది. మున్సిపల్ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతి జనసైనికుడు, ప్రతి వీరమహిళ పూర్తి ఉత్సాహంతో ఎన్నికల ప్రచారానికి సిద్ధంగా ఉండాలని పార్టీ నాయకత్వం పిలుపునిచ్చింది. పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలపై స్పష్టమైన దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత కార్యకర్తలపై ఉందని పేర్కొంది.

ఈ క్రమంలో త్వరలోనే మున్సిపల్ ఎన్నికల కార్యాచరణ ప్రణాళికను అధికారికంగా ప్రకటించనున్నట్లు జనసేన వెల్లడించింది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా, రానున్న మున్సిపల్ ఎన్నికలను కేంద్రంగా చేసుకుని పని చేయాలని నిర్ణయించింది. పట్టణ సమస్యలు, మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, తాగునీరు, ట్రాఫిక్ వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పార్టీ ఉనికిని బలపరచాలని సూచించింది.

ఈ నేపథ్యంలో పార్టీ కోసం కట్టుదిట్టంగా పనిచేసేలా నూతన కమిటీల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా రాష్ట్ర గ్రేటర్ హైదరాబాద్ అడ్ హాక్ కమిటీ జాబితాను జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామ్ ప్రకటించారు. ఈ కమిటీ ద్వారా గ్రేటర్ హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాలు సమన్వయంతో సాగుతాయని, ఎన్నికల సన్నాహకాలు వేగవంతం అవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్లకు ఓటరు జాబితాల తయారీ షెడ్యూల్ విడుదలైన విష‌యం తేలిసిందే. ఈ నెల‌లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది.