Let's talk: editor@tmv.in
తెలంగాణ‌ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

తెలంగాణ‌ మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం

Gaddamidi Naveen
11 ఫిబ్రవరి, 2026

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నేడు జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంతంగా, స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని అధికారులు తెలిపారు.మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2,996 వార్డుల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించిన ఎన్నికల సంఘం, ఇందుకోసం 8,203 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొంది. పోలింగ్ ప్రక్రియ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు తగిన సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అందులో సుమారు 25.62 లక్షల మంది పురుష ఓటర్లు, 26.80 లక్షల మంది మహిళా ఓటర్లు, అలాగే 640 మంది ఇతర వర్గాలకు చెందిన ఓటర్లు నేడు ఓట్లు హక్కును వినియోగించుకోనున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేపట్టినట్లు, ఎక్కడైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు ఇతర భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ చర్యలు కూడా అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.

ఎక్కడైనా అవసరమైతే ఫిబ్రవరి 12న రీ-పోలింగ్ చేపడతారు. పోలింగ్ ముగిసిన అనంతరం ఫిబ్రవరి 13 ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం ఫిబ్రవరి 16న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్ మేయర్, డిప్యూటీ మేయర్ పదవుల కోసం ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ఎంతో కీలకమని పేర్కొంటూ, రాష్ట్రంలోని అర్హులైన ప్రతి ఓటరు పెద్ద ఎత్తున పోలింగ్‌లో పాల్గొని శాతం వంద ఓటింగ్ నమోదు చేయాలని ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది. మున్సిపల్ ఎన్నికలు ప్రజల అభివృద్ధికి దిశానిర్దేశం చేసే ముఖ్యమైన ప్రక్రియ అని, అందరూ బాధ్యతాయుతంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ, పట్టణ ప్రాంతాల్లో కూడా తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తోంది. 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన నిరాశ తర్వాత బీఆర్ఎస్ ఈ మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించి తిరిగి బలపడాలని ఆశిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల నేపథ్యంలో ప్రతి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్లు రూపొందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.

మున్సిపల్‌ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: డీజీపీ శివధర్‌రెడ్డి

తెలంగాణలో నేడు జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి. శివధర్ రెడ్డి మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలలో ఎన్నికల నిర్వహణకు తగిన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

మొత్తం 8,203 పోలింగ్ కేంద్రాల్లో 1,302 కేంద్రాలను అత్యంత సున్నితమైనవిగా, 1,926 కేంద్రాలను సున్నితమైనవిగా గుర్తించినట్లు వెల్లడించారు. ఈ కేంద్రాల్లో అదనపు భద్రతా బలగాలను మోహరించి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని డీజీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా కనిపించే పోలీసింగ్‌ను పెంచినట్లు, ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. అన్ని పోలింగ్ కేంద్రాల లోపల 100 శాతం వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయగా, అత్యంత సున్నితమైన పోలింగ్ కేంద్రాల బయట కూడా వెబ్‌కాస్టింగ్ సదుపాయం కల్పించినట్లు తెలిపారు.

ఎన్నికల నియమావళి అమలులో భాగంగా 1,183 లైసెన్స్ ఆయుధాలను జమ చేయించగా, 4,318 మందిని బౌండ్ ఓవర్ చేసినట్లు చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘనలపై మొత్తం 142 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు ఆయ‌న వెల్లడించారు. గత 15 రోజులలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో రూ. 3.09 కోట్ల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, ఉచిత బహుమతులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం సోమవారం ముగిసింది.