
తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్.. అక్రమ ఓటు బ్యాంక్‌ను కాపాడేందుకే: ఎన్. రామచందర్ రావు
రాష్ట్రవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ ఏర్పాటు చేసి, మీ సేవ ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లు జారీ చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియ కొనసాగుతున్న సమయంలో అక్రమ ఓటు బ్యాంకులను కాపాడేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తొందరపాటుగా అమలు చేస్తోందని ఆరోపించారు.
ఈ మేరకు సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో ఆయన స్పందిస్తూ, అక్రమ రోహింగ్యాలు, బంగ్లాదేశ్, పాకిస్థాన్‌కు చెందిన చొరబాటుదారుల్లో ఒక్కరి పేరు కూడా రాష్ట్ర ఓటరు జాబితాలో ఉండనివ్వబోమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు అక్రమ ఓటు బ్యాంకులను పెంచి పోషించాయని, ఇప్పుడు ఎస్‌ఐఆర్ పరిశీలనతో వాటి రాజకీయ భవిష్యత్తుకు ముప్పు ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అందుకే ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్లను త్వరితగతిన జారీ చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయం పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్న రామచందర్ రావు, ఈ అంశంపై అవసరమైతే వీధుల్లోనూ, న్యాయస్థానాల్లోనూ పోరాటం చేస్తామని ప్రకటించారు.
ఇదిలా ఉండగా, పౌర సేవలను వేగవంతం చేయడం, కుటుంబ వివరాల పరిశీలనలో పారదర్శకత తేవడం, రికార్డులను సులభంగా అందుబాటులో ఉంచే లక్ష్యంతో తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్‌ను ప్రారంభించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రజలు వివిధ ప్రభుత్వ సేవలు పొందడానికి ప్రామాణికమైన పత్రాలను సమర్పించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించేందుకే 'మీసేవ' ద్వారా ఈ సర్టిఫికెట్లను అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించింది.
