
తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు-2025
తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత విద్యా రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు కోసం ‘తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు – 2025’ను శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ సభలో ప్రవేశపెట్టారు.
రాష్ట్రంలో విద్యా రంగాన్ని బలోపేతం చేయడం, యువతకు నాణ్యమైన ఉన్నత విద్యను అందుబాటులోకి తేవడమే ఈ సవరణ బిల్లు ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో కొత్త విశ్వవిద్యాలయాలు ఏర్పడడం ద్వారా విద్యా మౌలిక సదుపాయాలు విస్తరించడంతో పాటు, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఈ సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడుతూ, విద్యతోనే సమాజంలో మార్పు సాధ్యం. అందుకే రాష్ట్రంలోని విద్యార్థులకు మెరుగైన, ఆధునిక అవసరాలకు అనుగుణమైన విద్యను అందించాలనే తపన మా ప్రభుత్వానిది అని తెలిపారు. గ్లోబల్ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా విద్యను అందించే విధంగా కొత్త విశ్వవిద్యాలయాలు పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సవరణ బిల్లు అమలులోకి వస్తే, తెలంగాణ రాష్ట్రం విద్యా కేంద్రంగా మరింత బలపడుతుందని, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా విద్యార్థులు ఆకర్షితులవుతారని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యా రంగంలో పెట్టుబడులు పెరగడం ద్వారా రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కూడా ఇది దోహదపడుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల (సవరణ) బిల్లు – 2025’ ద్వారా రాష్ట్రంలో కొత్తగా మరో రెండు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు అసెంబ్లీ అధికారికంగా అనుమతినిచ్చింది.
అమిటీ యూనివర్సిటీ:
ఇది రంగారెడ్డి జిల్లాలోని మామిడిపల్లి ప్రాంతంలో ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌కు అత్యంత సమీపంలో ఉండటంతో, జాతీయ, అంతర్జాతీయ స్థాయి విద్యార్థులను ఆకర్షించేలా ఈ క్యాంపస్‌ను తీర్చిదిద్దనున్నారు.
సెంట్ మేరీస్ రీహెబిలిటేషన్ యూనివర్సిటీ:
యాదాద్రి, భువనగిరి జిల్లాలోని దేశ్ముఖి ప్రాంతంలో ఇది కొలువుదీరనుంది. ఇది ప్రధానంగా హెల్త్, రీహెబిలిటేషన్ (పునరావాస విద్య), అలోయిడ్ హెల్త్ సైన్సెస్ వంటి ప్రత్యేక కోర్సులపై దృష్టి సారించనుంది.
ఈ రెండు విశ్వవిద్యాలయాల రాకతో రాష్ట్రంలో విద్యావకాశాలు మెరుగుపడటమే కాకుండా, రంగారెడ్డి యాదాద్రి జిల్లాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యేకించి రీహెబిలిటేషన్ రంగంలో ప్రత్యేక వర్సిటీ ఏర్పాటు కావడం విద్యా రంగంలో ఒక కొత్త పరిణామం.
మన్‌మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీకి చట్టబద్ధత: మండలిలో బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి దామోదర్
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ద్వారా యూనివర్సిటీకి అధికారిక గుర్తింపు లభించనుందని మంత్రి తెలిపారు.
రూ. 500 కోట్లతో అభివృద్ధి
ఈ సందర్భంగా మండలిలో మాట్లాడిన మంత్రి, రూ. 500 కోట్ల వ్యయంతో డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యాధునిక మౌలిక సదుపాయాలతో యూనివర్సిటీని తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. విద్యా, పరిశోధన రంగాల్లో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో ఈ యూనివర్సిటీని అభివృద్ధి చేస్తున్నామన పేర్కొన్నారు.
యూనివర్సిటీ విస్తరణకు సంబంధించి 310 ఎకరాల సువిశాల ప్రాంగణం అందుబాటులో ఉందని మంత్రి తెలిపారు. అంతేకాకుండా, సుల్తాన్‌పూర్‌లోని జేఎన్‌టీయూ క్యాంపస్‌ను భవిష్యత్తులో పూర్తిస్థాయి యూనివర్సిటీగా మార్చే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రంలో ఉన్నత విద్యకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని అన్నారు.
సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ప్రాధాన్యత
యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన అన్ని ప్రమాణాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని మంత్రి దామోదర్ రాజనర్సింహ వివరించారు. విశాలమైన ప్రాంగణంతో పాటు, అన్ని రకాల వసతులు, అఫిలియేషన్‌కు సరిపడా కాలేజీలు సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రాంతాలు యూనివర్సిటీ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు.
మొత్తంగా, ఈ చట్ట సవరణ బిల్లు ద్వారా డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించి, తెలంగాణను ఎర్త్ సైన్సెస్ రంగంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ముందంజలో నిలపాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు.
