Let's talk: editor@tmv.in
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 15 రోజుల్లో నూతన ఆరోగ్య పథకం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 15 రోజుల్లో నూతన ఆరోగ్య పథకం

Gaddamidi Naveen
14 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని వచ్చే 15 రోజుల్లో ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు అధ్యక్షతన జరిగిన కీలక సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి సమక్షంలో ఈ పథకాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం, ఈ ఆరోగ్య పథకానికి ఉద్యోగులు తమ ప్రాథమిక వేతనం నుంచి 1.5 శాతం చొప్పున విరాళం అందించగా, ప్రభుత్వం కూడా అదే మేరకు మరో 1.5 శాతం చెల్లించనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.44 లక్షల ఉద్యోగులు, పెన్షనర్లు, 12.84 లక్షల ఆధారిత కుటుంబ సభ్యులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. ఉద్యోగుల నుంచి సంవత్సరానికి సుమారు రూ.528 కోట్ల నిధులు సమకూరనున్నాయి. దీనికి సమానంగా ప్రభుత్వం కూడా నిధులు అందించనుండటంతో పథకం ఆర్థికంగా బలంగా అమలవుతుందని అధికారులు తెలిపారు.

ఈ పథకాన్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేయనున్న ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులు, పెన్షనర్ల నుంచి ఇద్దరు ప్రతినిధులు ఉంటారు. ట్రస్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినే సీఈఓగా నియమించనున్నట్లు సమావేశంలో నిర్ణయించారు. పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో ఖరారు చేయనున్నారు.

ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ, ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం ఉద్యోగుల సంక్షేమానికి కీలకమైన ముందడుగుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీలు సి.వి. ఆనంద్, మహేష్ దత్ ఎక్కా, ఫైనాన్స్ సెక్రటరీ సందీప్ సుల్తానియా, హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జె. చోంగ్తు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఈ కొత్త పథకం ఉద్యోగుల ఆరోగ్య భద్రతలో ఒక విప్లవాత్మక అడుగు అని, నగదు రహిత చికిత్సలు మరింత సమర్థవంతంగా అందుతాయని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.