
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ కొనుగోలుపై 20శాతం రాయితీ
పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవానికి తెరలేపింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో, హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన ఈవీ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం సచివాలయ ప్రాంగణంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఐ అండ్ పీఆర్ కమిషనర్ సి. ప్రియాంక , ఉద్యోగ సంఘాల నేతలు వివిధ కంపెనీల ఎలక్ట్రిక్ వాహనాలను స్వయంగా పరిశీలించారు.
రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించి, గ్రీన్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రూపొందించిన ఈవీ పాలసీ కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రూపొందించిన ఈ విధానం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఢిల్లీ తరహా కాలుష్య సమస్యల నుంచి కాపాడాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం ఈ పాలసీ ప్రధాన ఉద్దేశం.
ఈ విధానంలో భాగంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు, ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలను కొనుగోలు చేసేలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు రాయితీలను ప్రకటించింది. రాష్ట్రంలోని 5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ఈవీ వాహనాల కొనుగోలుపై 10 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్ అందించాలని తయారీ సంస్థలను ప్రభుత్వం కోరింది. ఈవీ పాలసీ కింద రోడ్ టాక్స్, రిజిస్ట్రేషన్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి సుమారు రూ.1000 కోట్ల ఆదాయం తగ్గుతున్నప్పటికీ, ప్రజారోగ్యం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రజాప్రతినిధుల ద్వారా ఈవీ వాహనాల కొనుగోలుకు సులభంగా రుణాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఇంధన కొరతను దృష్టిలో ఉంచుకుని, ఈవీల వినియోగాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశ్యం. 2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం 544గా ఉన్న ఈవీల సంఖ్య, ప్రస్తుతం 2.50 లక్షలు దాటడం రాష్ట్ర ప్రగతికి నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ ఖజానాపై భారం పడకుండా ఈ రాయితీలు అందించేందుకు సహకరించిన మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 2030 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 6,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసి, తెలంగాణను దేశంలోనే ఈవీ విధానంలో అగ్రగామిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
మౌలిక సదుపాయాల విస్తరణ
రాష్ట్రవ్యాప్తంగా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను విస్తరించే పనులు వేగంగా కొనసాగుతున్నాయి.రెడ్కో ఆధ్వర్యంలో మహీంద్రా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, ఓలా, గ్రావ్టన్ మోటార్స్ వంటి సంస్థలు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తున్నాయి. ఇక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ రంగంలో కూడా మార్పులు తీసుకువస్తున్నారు. పాత డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చే ప్రక్రియను ప్రారంభించనున్నారు. క్యూర్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నారు. 15 ఏళ్లు దాటిన పాత వాహనాలను తుక్కుగా మార్చే విధానాన్ని ఖచ్చితంగా అమలు చేయనున్నారు. తెలంగాణను 'వాహన్' పోర్టల్‌తో అనుసంధానించడం ద్వారా షోరూమ్‌లలోనే నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకునే సౌలభ్యం కల్పించారు.
కాలుష్య రహిత హైదరాబాద్ లక్ష్యంగా
సీఎస్ రామకృష్ణ రావు మాట్లాడుతూ, రాష్ట్ర జనాభాలో 30 శాతం మంది హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారని, ఢిల్లీ వంటి కాలుష్య సమస్యలు ఇక్కడ తలెత్తకుండా ఉండాలంటే ఈవీల వినియోగం అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. క్యూర్ ఇనిషియేటివ్ కింద 2000 కిలోమీటర్ల మేర ఈవీ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు.
పర్యావరణ హితమైన, సుస్థిరమైన తెలంగాణ నిర్మాణంలో ప్రభుత్వ ఉద్యోగులు భాగస్వాములు కావాలని, ఈ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం పిలుపునిచ్చింది.
