
తెలంగాణ ప్రభుత్వానికి స్వల్ప ఊరట
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట దక్కింది. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిటిషన్లు హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున తాము బలమైన వాదనలు వినిపించామని.. అందుకే న్యాయస్థానం ఈ పిటిషన్లను కొట్టేసిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాకు వెల్లడించారు.
సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఆర్టికల్ 32 కింద దాఖలైన ఈ పిటిషన్‌పై విచారణకు స్వీకరించలేమని జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టుకు వెళ్లి తేల్చుకోవాలని సూచించింది. అయితే హైకోర్టు తీర్పుపై ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాదులు సిద్ధార్థ్ దవే, అభిషేక్ మను సింఘ్వీ, తదితరులు వాదనలు వినిపించారు. హైకోర్టులో ఈ పిటిషన్ పెండింగ్‌లో ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. "హైకోర్టు స్టే ఇవ్వకపోతే సుప్రీంకోర్టుకు వచ్చేస్తారా? ఇది సరైన మార్గమా?" అని సుప్రీంకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది.
మా వాదనలను కోర్టు స్వీకరించింది: భట్టి
తీర్పు అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. "సుప్రీంకోర్టులో మా సీనియర్ న్యాయవాదులు అన్ని విషయాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కోర్టు తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా కేసును కొట్టివేసింది" అని పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి తదితరులు ఢిల్లీలో మకాం వేసి ఈ కేసును పర్యవేక్షించారు.
హైకోర్టు తీర్పే కీలకం
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కనున్నాయి. అయితే ఈ తీర్పు రాజ్యాంగ విరుద్ధమని కొందరు వాదిస్తున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తే మొత్తం రిజర్వేషన్ 67 శాతానికి చేరుతుంది కాబట్టి ఈ జీవో చట్టబద్ధం కాదని విశ్లేషకులు అంటున్నారు. మరి హైకోర్టు ఇవ్వబోయే తీర్పును అనుసరించి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తారా? లేదా? అన్నది తేలనున్నది. ఒకవేళ హైకోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చినా .. మరోసారి పిటిషనర్లు సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.
కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం
బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్ఠాత్మకం. బీసీలకు రిజర్వేషన్ ఇస్తామంటూ కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందుకనుగుణంగా రాష్ట్రంలో కులగణన కూడా చేపట్టారు. పార్టీలపరంగా రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదనలతో సిద్ధం కావొచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా అత్యధికం కాబట్టి వారిని ఆకట్టుకొనేందుకే కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. కానీ రిజర్వేషన్ల అమలుకు న్యాయపరమైన అడ్డంకులు ఉన్నాయి. వీటిని కాంగ్రెస్ పార్టీ ఎలా అధిగమిస్తుందో వేచి చూడాలి.
బీసీల జనాభా అధికం
తెలంగాణ జనాభాలో బీసీలు 50% పైబడి ఉన్నట్టు సమాచారం. 42% కోటా ద్వారా వారికి ప్రాతినిధ్యం పెరుగుతుందని ఎప్పటినుంచే డిమాండ్ చేస్తున్నారు. అయితే బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించాలంటే పార్లమెంటులో సవరణ జరగడమే ఏకైక మార్గం. ఈ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లును 9వ షెడ్యూల్‌లో చేరిస్తేనే న్యాయపరమైన చిక్కులు జరగకుండా ఉంటాయి. అందుకే కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేను ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ భావిస్తోంది. తాము బీసీ రిజర్వేషన్ల కోసమే ఎంత చేయాలో అంతా చేస్తున్నామని.. న్యాయస్థానంలోనూ కొట్లాడుతున్నామని చెప్పేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. తద్వారా బీసీలను ఆకట్టుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి.
9వ షెడ్యూల్ ఏం చెబుతోంది?
9వ షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో ఒక ప్రత్యేక భాగం. ఇది 1951లో మొదటి సవరణ ద్వారా చేర్చబడింది. దీని ప్రధాన ఉద్దేశ్యం కొన్ని చట్టాలను న్యాయస్థానాల పరిశీలన నుంచి రక్షించడం, అంటే ఈ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలను న్యాయస్థానాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించలేవు. దీంతో తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో అమలు చేసిన బీసీ రిజర్వేషన్ బిల్లును ఈ 9వ షెడ్యూల్‌లో చేరిస్తే న్యాయపరమైన చిక్కులను అధిగమించే అవకాశం ఉంటుంది.
ఈ షెడ్యూల్ ఎందుకు తీసుకొచ్చారు?
9వ షెడ్యూల్‌ను ప్రవేశపెట్టడానికి ప్రధాన కారణం భూ సంస్కరణ చట్టాలను రక్షించడం. భూ సంస్కరణలు, జమీందారీ వ్యవస్థ రద్దు, భూమి పంపిణీ వంటి చట్టాలు రాజ్యాంగంలోని ఆస్తి హక్కు (అప్పటి ఆర్టికల్ 31)ను ఉల్లంఘించాయని న్యాయస్థానాలు పరిగణించాయి. ఈ చట్టాలను న్యాయస్థానాల జోక్యం నుండి రక్షించడానికి 9వ షెడ్యూల్ తీసుకొచ్చారు.
ఈ షెడ్యూల్ నిబంధనలు ఏమిటి?
ఈ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు రాజ్యాంగంలోని ఏ హక్కును ఉల్లంఘించినా, వాటిని న్యాయస్థానంలో సవాలు చేయలేము. అయితే, 2007లో ఐఆర్ కొయిల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఒక ముఖ్యమైన తీర్పు ఇచ్చింది. ఈ షెడ్యూల్‌లో చేర్చిన చట్టాలు రాజ్యాంగంలోని ప్రాథమిక నిర్మాణ సిద్ధాంతంను ఉల్లంఘిస్తే, అవి న్యాయస్థాన పరిశీలనకు లోబడి ఉంటాయని తీర్పు చెప్పింది.
ఇప్పటికి ఏయే చట్టాలను చేర్చారు?
9వ షెడ్యూల్‌లో ప్రస్తుతం 284 చట్టాలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా భూ సంస్కరణలు, రిజర్వేషన్లు, ఇతర సామాజిక-ఆర్థిక సంస్కరణలకు సంబంధించినవి. ఉదాహరణకు, రాష్ట్రాల్లో భూ సంస్కరణ చట్టాలు, జమీందారీ రద్దు చట్టాలు మొదలైనవి ఇందులో ఉన్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలంటే అందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖతను వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కారు అంత సాహసానికి పూనుకునే అవకాశం లేదు.
