Let's talk: editor@tmv.in
తెలంగాణ ప్రజల కష్టాల కంటే మెస్సికే ప్రాధాన్యమా? రాహుల్ గాంధీపై బండి సంజయ్ ఫైర్

తెలంగాణ ప్రజల కష్టాల కంటే మెస్సికే ప్రాధాన్యమా? రాహుల్ గాంధీపై బండి సంజయ్ ఫైర్

Gaddamidi Naveen
15 డిసెంబర్, 2025

తెలంగాణ ప్రజల కష్టాల కంటే ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి కార్యక్రమానికి లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రాధాన్యత ఇచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రస్థాయిలో విమర్శించారు.మెస్సి 'గోట్ ఇండియా టూర్' కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొనడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఆదివారం 'ఎక్స్' వేదికగా ప్ర‌శ్నించారు.

ప్రజలు అవసరంలో ఉన్నప్పుడు నిమిషంలో తెలంగాణకు వస్తా అని రాహుల్ గాంధీ ఇచ్చిన హామీ వాస్తవంలో అమలుకావడం లేదన్నారు. ఆ నిమిషం “లగ్జరీ టైమ్ జోన్”లోనే నడుస్తోందని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజల బాధలకు మాత్రం ఆయన గడియారం పనిచేయదని, కేవలం వీఐపీ ఈవెంట్లు, ఫోటో అవకాశాలకే స్పందిస్తుందన్నారు. తెలంగాణ ప్రజల బాధలకంటే ఒక ఫుట్‌బాల్ స్టార్‌కు ప్రాధాన్యం ఇవ్వడం దురదృష్టకరమని ఆరోపించారు. శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్న రాహుల్ గాంధీ, మెస్సీతో పాటు అతని ఇంటర్ మయామి సహచరులు లూయిస్ సువారెజ్, రోడ్రిగో డీ పాల్, ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో కలిసి కార్యక్రమం ముగింపు సందర్భంగా జరిగిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు హామీలు సహా అనేక వాగ్దానాలు ఇప్పటికీ నెరవేర్చలేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ కనిపించరని, అశాంతి సమయంలో సెలవుల్లో ఉంటారని, వెలుగులోకి వచ్చే కార్యక్రమాల్లో మాత్రం పూర్తిగా హాజరవుతారని విమర్శించారు. తాను తెలంగాణ ప్రజలకు అవసరమైనప్పుడు వెంటనే వస్తానని రాహుల్ గాంధీ చేసిన ప్రసంగ వీడియోను కూడా బండి సంజయ్ తన పోస్టులో ట్యాగ్ చేస్తూ, ఆ మాటలు ఆచరణలోకి రావడం లేదని మరోసారి ఎద్దేవా చేశారు.

తెలంగాణ ప్రజల కష్టాల కంటే మెస్సికే ప్రాధాన్యమా? రాహుల్ గాంధీపై బండి సంజయ్ ఫైర్ - Tholi Paluku