Let's talk: editor@tmv.in
తెలంగాణ ప్రజలకు ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి పొన్నం

తెలంగాణ ప్రజలకు ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
3 డిసెంబర్, 2025

తెలంగాణ ప్రజల‌ను అవమానించే విధంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారితీసే అవకాశముందని తెలంగాణ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు.

ఈ సంద‌ర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ..తెలంగాణలో తుఫాన్ ప్రభావంతో అనేక ప్రాంతాలు మునిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సమయంలో, ఆ ప్రభావాన్ని ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే భావించామని, ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ను నిందించలేదని ఆయ‌న అన్నారు. అయితే, కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి “తెలంగాణ దిష్టి తగిలింది” అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు వివేకవంతుడా? అవివేకవంతుడా? అని మంత్రి విమర్శించారు.

తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అన్నదమ్ముల్లా కలిసి ఎదగాల్సిన పరిస్థితిలో, ప్రజల మధ్య విభేదాలు కలిగించే మాటలు పలకడం దురదృష్టకరమని, ముఖ్యంగా ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో కూడా బీజేపీ పొత్తు కొనసాగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మరింత విచారకరమని ఆయ‌న అన్నారు.మిత్రపక్షానికి బాధ్యత వహిస్తున్న తెలంగాణ బీజేపీ నాయకత్వం ఈ వ్యాఖ్యలపై తప్పక స్పందించాలని డిమాండ్ చేశారు. అలాగే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై జోక్యం చేసుకోవాలని ఆయ‌న కోరారు.

ఆంధ్రాలో తుఫాను వచ్చినప్పుడు మా హుస్నాబాద్ మునిగిపోయింది. కానీ మేము ఆంధ్ర ప్రజలను ఎప్పుడూ నిందించలేదు. ప్రకృతి వైపరీత్యం అని భావించాము. ఇప్పుడు ఎక్కడెక్కడో చెట్లు ఎండిపోతే తెలంగాణ దిష్టి తగిలిందని చెప్పడం మా రాష్ట్ర ప్రజలను అవమానించడం అని ఆయ‌న‌ విమర్శిస్తున్నారు.వెంటనే పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి వివక్షపూరిత వ్యాఖ్యలు చేయకుండా విజ్ఞతతో వ్యవహరించాలని మంత్రి పొన్నం సూచించారు.