Let's talk: editor@tmv.in
తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15న గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్లు, ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్

తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15న గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్లు, ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్

Yellarthi Chennabasava
11 ఆగస్టు, 2026

రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ సంద‌ర్భంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సంక్షేమ పథకాల విస్తరణతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను భారీగా పరుగులు తీందించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తమ సంక్షేమ, అభివృద్ధి అజెండాలోని రెండో విడత అమలులో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది.

‘చేయూత’ సామాజిక భద్రత ప్రస్తుతం నెలకు 41 లక్షల మందికి దాదాపు రూ. 11,000 కోట్ల వ్యయంతో పింఛన్లు అందిస్తుండగా, కొత్తగా తలసేమియా, సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడుతున్న బాధితులతో పాటు మరొక 2.25 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేయనున్నారు.

‘గృహజ్యోతి’ పథకం కింద మరో 3 నుంచి 4 లక్షల కొత్త కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నారు. ‘మహాలక్ష్మి’ పథకంలో రూ.500కే ఎల్పీజీ సిలిండర్‌ సబ్సిడీ ప్రయోజనాలను మరో 5 లక్షల కుటుంబాలకు విస్తరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1.05 కోట్ల స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీకి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. మొదటి దశలో సంగారెడ్డి నుంచి పంపిణీ ప్రారంభించనున్నట్లు సమాచారం. సనాత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిని స్వాతంత్ర్య దినోత్సవం రోజే ప్రారంభించనున్నారు. అలాగే గిగ్‌ వర్కర్ల సంక్షేమ చట్టం అమల్లోకి రానుంది. దీంతో యాప్‌ ఆధారితంగా పనిచేసే ప్లాట్‌ఫామ్‌ వర్కర్లకు సామాజిక భద్రత, సంక్షేమానికి మరింత రక్షణ లభించనుంది.

రాష్ట్రంలో సంక్షేమంతో పాటు మౌలిక వసతుల రంగానికి పెద్దపీట వేస్తూ ప్రభుత్వం పలు ప్రాజెక్టులను వేగవంతం చేస్తోంది. సెప్టెంబర్‌లో 'ఇందిరమ్మ టవర్స్' నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే గాంధీ సరోవర్‌, మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులకు వేగం పెంచనుంది. ఫ్యూచర్‌ సిటీ అభివృద్ధిని కీలక ప్రాధాన్యంగా కొనసాగించనుంది. ఉస్మానియా జనరల్‌ ఆసుపత్రి, నిమ్స్‌లో కొత్త భవనాల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 15న కేవలం కేవలం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకే పరిమితం కాకుండా, విస్తరించిన సంక్షేమం, కొత్త అవకాశాలు, వేగవంతమైన అభివృద్ధికి చిహ్నంగా తెలంగాణలో ప్రత్యేకంగా నిలవనుంది.

తెలంగాణ ప్రజలకు ఆగస్టు 15న గుడ్‌న్యూస్.. కొత్త పింఛన్లు, ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్ - Tholi Paluku