
తెలంగాణ పోలీసుల ఎదుట 30 మంది మావోయిస్టుల లొంగుబాటు
గత కొంతకాలంగా తెలంగాణ పోలీసులు చేపట్టిన నిరంతర ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. సోమవారం నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన దాదాపు 30 మంది సభ్యులు తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) బెటాలియన్‌కు చెందిన డిప్యూటీ కమాండర్ కూడా ఉన్నారు. మావోయిస్టుల నుంచి ఏకే-47, ఎస్ఎల్‌ఆర్‌లతో సహా 50 వరకు ఆయుధాలు స్వాధీనం చేస్తుకున్నారు.
ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దుల్లో లొంగిపోయిన వారిలో పీఎల్‌జీఏ డిప్యూటీ కమాండర్ సోడి కేశాలు అలియాస్ సోడి కేశ ముఖ్యులలో ఒకరని సమాచారం. వీరి లొంగుబాటును వచ్చే కొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇటీవల కాలంలో మావోయిస్టు కార్యకలాపాలపై తెలంగాణ పోలీసులు చేపట్టిన నిరంతర చర్యల ఫలితంగా పెద్ద సంఖ్యలో క్యాడర్ లొంగిపోతున్నారని అధికారులు చెబుతున్నారు. గతంలో కూడా ఇదే పీఎల్‌జీఏ బెటాలియన్ కమాండర్ బడ్సే సుక్కా అలియాస్ దేవా సహా 19 మంది సభ్యులు జనవరి 3న లొంగిపోయారు. ఆ ఘటన అనంతరం పీఎల్‌జీఏ బెటాలియన్, తెలంగాణ రాష్ట్ర కమిటీపై పెద్ద దెబ్బగా మారిందని పోలీస్ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి.
డీజీపీ పిలుపు - పునరావాస పథకాలు
మార్చి 30న తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకులు, కార్యకర్తలు హింసను విడిచిపెట్టి ఆయుధాలు వదిలి ప్రజాస్వామ్య ప్రధాన స్రవంతిలో చేరాలని ప్రత్యేకంగా పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన, ఇతర రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్న మావోయిస్టులకు కూడా ఆయన స్వరాష్ట్రానికి తిరిగి వచ్చి పునరావాస పథకాల ప్రయోజనాలను పొందాలని సూచించారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల్లో యాక్టివ్‌గా ఉన్న ముప్పాళ్ల లక్ష్మణరావు (గణపతి), పుసునూరి నరహరి (సంతోష్), జోడే రత్నాబాయి (సుజాత) వంటి సీనియర్ నేతలు తిరిగి వచ్చి ప్రభుత్వ పునరావాస పథకాలను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ పోలీసుల నిరంతర కృషితో గత రెండేళ్లలో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వివిధ స్థాయిలకు చెందిన 721 మంది మావోయిస్టులు లొంగిపోయి ప్రధాన స్రవంతిలోకి చేరినట్లు డీజీపీ తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24న పార్టీ కేంద్ర కమిటీ కీలక సభ్యుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ, మరో కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డితో పాటు ఇద్దరు సీనియర్ క్యాడర్ లొంగిపోవడం గమనార్హం. ఈ తాజా లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ, పీఎల్‌జీఏ బలగం మరింత బలహీనపడిందని, , శాంతి భద్రతల పరిరక్షణలో ఇది కీలక పరిణామంగా అధికారులు భావిస్తున్నారు. లొంగిపోయిన వారి వివరాలను అధికారిక ప్రకటనను మరికొద్ది రోజుల్లో పూర్తిస్థాయిలో వెల్లడించనున్నారు.
