Let's talk: editor@tmv.in
తెలంగాణ పాఠశాలల్లో ఫిబ్రవరి 13న ‘ఆంగ్ల భాషా దినోత్సవం’: ఎస్సీఈఆర్టీ ఆదేశాలు.

తెలంగాణ పాఠశాలల్లో ఫిబ్రవరి 13న ‘ఆంగ్ల భాషా దినోత్సవం’: ఎస్సీఈఆర్టీ ఆదేశాలు.

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఫిబ్రవరి 13వ తేదీన 'ఆంగ్ల భాషా దినోత్సవం' నిర్వహించాలని రాష్ట్ర విద్య పరిశోధన శిక్షణ సంస్థ (ఎస్సీఈఆర్టీ ) నిర్ణయించింది. భారత కోకిల, ప్రముఖ కవయిత్రి సరోజినీ నాయుడు జయంతిని పురస్కరించుకుని ఈ వేడుకలను జరపాలని డైరెక్టర్ జి. రమేష్ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ చేసిన విన్నపాన్ని మన్నిస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రతి ఏటా ఫిబ్రవరి 13న సరోజినీ నాయుడు పుట్టినరోజును ఆంగ్ల భాషా దినోత్సవంగా జరపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

వ్యాసరచన, వక్తృత్వ పోటీలు:

ఈ సందర్భంగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులు వారి అభ్యసన ఫలితాలకు అనుగుణంగా ఇతివృత్తాలను ఎంచుకుని, వ్యాసరచన, వక్తృత్వ పోటీలు, సృజనాత్మక వర్క్‌షాప్‌లు (కథలు, కవితలు, పోస్టర్ మేకింగ్) నిర్వహించాలని, ఫిబ్రవరి 13, 2026న ఆంగ్ల భాష యొక్క ప్రపంచ, సాంస్కృతిక ప్రాముఖ్యతను చాటిచెబుతూ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, జిల్లా పరిషత్ స్కూళ్ళు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, గురుకులాల్లో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారులను ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ ఆదేశించారు. సరోజినీ నాయుడు రాసిన సాహిత్యాన్ని, ఆమె చేసిన సేవలను విద్యార్థులకు వివరించాలని ఈ సందర్భంగా సూచించారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి సరోజినీ నాయుడు

సరోజినీ నాయుడు 1879, ఫిబ్రవరి 13న హైదరాబాద్‌లోని ఒక బెంగాలీ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆమె చిన్నతనం నుండే అసాధారణమైన తెలివితేటలు కనబరిచారు. కేవలం 12 ఏళ్ల వయసులోనే మద్రాస్ విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ పూర్తి చేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఆమెను 'భారత కోకిల' అని పిలవడానికి ప్రధాన కారణం ఆమె రాసిన అద్భుతమైన ఆంగ్ల కవిత్వం. ఆమె కవితలలోని పదాల పొందిక, లయ మరియు భావం శ్రోతలను మంత్రముగ్ధులను చేసేవి. "The Golden Threshold", "The Bird of Time", మరియు "The Broken Wing" వంటి ఆమె రచనలు భారతీయ సంస్కృతిని, ప్రకృతిని, సామాజిక జీవనాన్ని ప్రపంచానికి పరిచయం చేశాయి. ఆంగ్ల భాషపై ఆమెకున్న పట్టు అసమానమైనది, అందుకే ఆమె పుట్టినరోజును 'ఆంగ్ల భాషా దినోత్సవం'గా జరుపుకోవడం ఎంతో సముచితం.

స్వాతంత్ర పోరాటం, రాజకీయ నాయకత్వం:

సాహిత్య రంగంలోనే కాకుండా, భారత స్వాతంత్ర సంగ్రామంలో సరోజినీ నాయుడు పోషించిన పాత్ర చిరస్మరణీయమైనది. గోపాలకృష్ణ గోఖలే, మహాత్మా గాంధీ వంటి నాయకుల పిలుపు మేరకు ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1925లో భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి భారతీయ మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని పలుమార్లు జైలు శిక్ష అనుభవించారు. దేశానికి స్వాతంత్ర౦ సిద్ధించిన తర్వాత, ఆమె ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమితులయ్యారు, తద్వారా భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నరైన మొదటి మహిళగా నిలిచారు. మహిళా సాధికారత కోసం, అంటరానితనం నిర్మూలన కోసం ఆమె చేసిన పోరాటం నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకం.