
తెలంగాణ పల్లె పోరు.. తొలి దశ జిల్లాలు, మద్దతు పార్టీల వారీగా ఫలితాలు
తెలంగాణలో గురువారం జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో 84 శాతం కంటే ఎక్కువ మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ప్రకటించింది. మొత్తం 53,57,277 మంది అర్హులలో 45,15,141 మంది ఓటర్లు ఓటును వేశారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరిగింది. అనంతరం 2 గంటలకు లెక్కింపును ప్రారంభించారు.
ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని అదనపు డీజీపీ మహేష్ ఎం. భగవత్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాలను క్రిటికల్, నార్మల్‌గా వర్గీకరించి తగిన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అదేవిధంగా,4236 పంచాయతీల్లో 396 గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలు జరిగాయని ఎన్నికల సంఘం పేర్కొంది. సర్పంచ్ పదవికి సుమారు 13,000 మంది పోటీ చేశారు. అలాగే 27,628 వార్డులకు 65,455 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
గ్రామ పంచాయతీ ఎన్నికలు 3 దశల్లో
రాష్ట్ర ఎన్నికల సంఘం నవంబర్ 25న ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు దశల్లో, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో జరుగుతున్నాయి. ఇటీవలి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌లో కాంగ్రెస్ విజయం సాధించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ల ప్రజాదరణకు పరీక్షగా భావిస్తున్నారు. అయితే ఎన్నికలు అధికారికంగా పక్షపాత్ర రహితంగా జరుగుతున్నాయి.రేపు రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది.
