Let's talk: editor@tmv.in
తెలంగాణ పర్యాటక రంగాన్ని పీపీపీ మోడల్‌తో అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి

తెలంగాణ పర్యాటక రంగాన్ని పీపీపీ మోడల్‌తో అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి

Gaddamidi Naveen
6 జనవరి, 2026

తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని అమలులోకి తెచ్చిందని, దీని ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఆదిలాబాద్ జిల్లాలోని అతి ప్రాచీన ఆలయాల్లో ఒకటైన శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. భక్తులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చేలా మౌలిక సదుపాయాలు, రహదారులు, వసతి సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు ఉంటాయని మంత్రి తెలిపారు. అలాగే వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి అనుబంధంగా ఉన్న చెరువు అభివృద్ధి, బోటింగ్ సదుపాయం, రోప్‌వే ఏర్పాటు అంశాలపై అధ్యయనం చేసి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని మంత్రి పేర్కొన్నారు.

సిరిసిల్లలో పెండింగ్‌లో ఉన్న హరిత హోటల్ పనులను పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటామని, పర్యాటకులకు మెరుగైన వసతి కల్పించడమే లక్ష్యమని చెప్పారు. హైదరాబాద్ నగరంలోని చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్ వంటి చారిత్రక, వారసత్వ ప్రదేశాలకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ సుందరీ పోటీల సందర్భంగా వచ్చిన అందగత్తెలను (సుందరీమణులను) రాష్ట్రంలోని ముఖ్య పర్యాటక ప్రాంతాలు సందర్శించేలా చేసి, తెలంగాణ చారిత్రక, సాంస్కృతిక సంపదను ప్రపంచానికి ఘనంగా చాటిచెప్పామని మంత్రి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ పర్యాటక కేంద్రంగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో టూరిజం వాటాను పెంచడం, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని వివరించారు. కామారెడ్డి జిల్లాలోని నిజాం సాగర్‌లో వాటర్ స్పోర్ట్స్, బోటింగ్ సదుపాయాల కోసం ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. అలాగే కౌలస్ కోట, నాగన్నమెట్ల బావి అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

బాసర జ్ఞాన సరస్వతి దేవాలయం, డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం అభివృద్ధికి పర్యాటక అవకాశాలకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించి అమలు చేస్తామని పేర్కొన్నారు. శ్రీరాంసాగర్ బ్యాక్‌వాటర్ ప్రాంతాన్ని టూరిజం స్పాట్‌గా అభివృద్ధి చేయడంతో పాటు ఎస్సాఆర్ఎస్పీ రిజర్వాయర్‌లో బోటింగ్ సదుపాయం, హరిత హోటల్ పునరుద్ధరణ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి తెలిపారు.

రానున్న రోజుల్లో తెలంగాణ పర్యాటకం కొత్త పుంతలు తొక్కనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. గతంలో సరైన పర్యాటక విధానం లేకపోవడం వల్ల ఈ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో నూతన పర్యాటక విధానాన్ని తీసుకొచ్చామని, పీపీపీ మోడల్‌లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు దేశ, విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు రాయితీలు ఇస్తున్నామని చెప్పారు. టూరిజం కాన్క్లేవ్, గ్లోబల్ సమ్మిట్‌ల ద్వారా పెట్టుబడిదారులు ముందుకు రావడం ఇందుకు నిదర్శనమన్నారు.

అలాగే పదేండ్ల పాలనలో ప్రాజెక్టులు పూర్తిచేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని మంత్రి తీవ్రంగా విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులతో పాటు పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసే బాధ్యత తమ ప్రజా ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. కేసీఆర్‌కు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన ఘనత దక్కిందని, రైతుబంధు పేరుతో రింగ్ రోడ్డును అమ్మారని మంత్రి ఆరోపించారు.

రెండేళ్లలోనే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశామని, ఆరు గ్యారెంటీల్లో మిగిలిన వాటిని కూడా అమల్లోకి తీసుకువస్తామని చెప్పారు. వరుస ఎన్నికల్లో ఓటములతో కేసీఆర్ భయపడుతూ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీకి వచ్చి చర్చించడానికి ధైర్యం లేని కేసీఆర్‌కు ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత లేదని, అక్రమాల నుంచి తప్పించుకునేందుకే బహిరంగ సభల్లో మాట్లాడుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు.