Let's talk: editor@tmv.in
తెలంగాణ పర్యాటక రంగంలో నూతన శకం: 'విజన్ 2026'తో గ్లోబల్ టూరిజం వైపు అడుగులు

తెలంగాణ పర్యాటక రంగంలో నూతన శకం: 'విజన్ 2026'తో గ్లోబల్ టూరిజం వైపు అడుగులు

Gaddamidi Naveen
31 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర పర్యాటక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వం భారీ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. హైదరాబాద్‌లోని చారిత్రక తారామతి బరాదరిలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసి) ఆధ్వర్యంలో నిర్వహించిన ‘టూరిజం అండ్ ఇట్స్ విజన్ 2026’ మేధోమథన సదస్సులో పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావుతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీజీటీడీసి-2026 టేబుల్ క్యాలెండర్‌ను మంత్రి జూప‌ల్లి ఆవిష్కరించారు.

వారసత్వానికి మెరుగులు - ప్రపంచానికి పరిచయం

ఈ సందర్భంగా మంత్రి జూప‌ల్లి కృష్ణారావు మాట్టిడుతూ, ప్రస్తుతం ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిందని, ఈ పరిస్థితుల్లో పర్యాటక రంగంలో కొత్తగా అద్భుతాలు సృష్టించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలంగాణకు ప్రకృతి ప్రసాదించిన అపారమైన వనరులు, గొప్ప వారసత్వ సంపద ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. వాటికి మెరుగులు దిద్ది, సరైన పద్ధతిలో ప్రపంచానికి పరిచయం చేస్తే చాలని అభిప్రాయపడ్డారు. అలా చేస్తే దేశీ, విదేశీ పర్యాటకులు సహజంగానే తెలంగాణ వైపు ఆకర్షితులవుతారని అన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న అద్భుతాలను నగరవాసులకు పరిచయం చేయడం, తెలంగాణ ప్రత్యేకతలను దేశ, అంతర్జాతీయ పర్యాటకులకు చేరువ చేయడమే లక్ష్యంగా ప్రణాళికలు ఉండాలన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో పాటు గిరిజనుల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఆచారాలను పర్యాటకులకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అదే సమయంలో అడవులు, కొండకోనల్లో ప్రకృతితో మమేకమై జీవిస్తున్న ఆదివాసీలు, గిరిజనులకు నగరంలోని చారిత్రక కట్టడాలు, వారసత్వ సంపద, ఆకాశహర్మ్యాలు, మెట్రో రైళ్లు, ఆధునిక నగర జీవన శైలిని తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని మంత్రి తెలిపారు.

మౌలిక సదుపాయాలే కీలకం

పర్యాటకులు కేవలం ఒకరోజు వచ్చి వెళ్లిపోవడం కాకుండా, కనీసం రెండు రోజులు బస చేసేలా ఆకర్షణీయమైన వాతావరణాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు అనుగుణంగా వసతి సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పర్యాటక రంగం కేవలం దర్శనానికి పరిమితం కాకుండా, వసతి, భోజనం, రవాణా వంటి మౌలిక సదుపాయాల్లో నాణ్యత పెరగాలని మంత్రి స్పష్టం చేశారు. ఐటీ కారిడార్లు, భారీ షాపింగ్ మాల్స్, విద్యాసంస్థల్లో పర్యాటక ప్రచార చిత్రాలు ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కళారూపాలు, వినూత్న స్కిట్స్ ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవాలని మంత్రి సూచించారు.

కేరళతో పోటీ - అగ్రస్థానమే లక్ష్యం

హాస్పిటాలిటీ రంగంలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలన్నదే లక్ష్యమని, కేరళ వంటి రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి మనం ఎదగాలని మంత్రి పిలుపునిచ్చారు. పర్యాటక శాఖలో సమూల సంస్కరణలు తీసుకురావడానికి తాను పూర్తి మద్దతు ఇస్తానని స్పష్టం చేసిన ఆయన, అధికారులు క్షేత్రస్థాయి సిబ్బంది సమన్వయంతో పనిచేసి తెలంగాణ పర్యాటక రంగాన్ని మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని మంత్రి సూచించారు.