Let's talk: editor@tmv.in
తెలంగాణ పంచాయతీలకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు: కిషన్ రెడ్డి

తెలంగాణ పంచాయతీలకు కేంద్రం నుంచి మరిన్ని నిధులు: కిషన్ రెడ్డి

Pinjari Chand
15 జనవరి, 2026

తెలంగాణలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతానికి కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులు విడుదల చేయనుందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి నిధుల్లో 80 శాతం పెంపుతో రూ.9,050 కోట్లు కేటాయించినట్లు ఆయన వెల్లడించారు. గత దశాబ్దంలో తెలంగాణలోని గ్రామ పంచాయతీలు, స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం రూ.11,000 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని కిషన్ రెడ్డి చెప్పారు. 2015–16 నుంచి 2019–20 మధ్య కాలంలో రూ.5,060 కోట్లు విడుదల కాగా, 2020–21 నుంచి 2025–26 మధ్య కాలానికి కేటాయింపులు 80 శాతం పెరిగి రూ.9,050 కోట్లకు చేరుకున్నాయని తెలిపారు. ఇందులో ఇప్పటికే రూ.6,051 కోట్లు విడుదలయ్యాయని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తికావడం, 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వినియోగ ధృవపత్రాలు (యుటిలైజేషన్ సర్టిఫికెట్లు) సమర్పణ అనంతరం, 2024–25 సంవత్సరానికి తొలి విడతగా రూ.260 కోట్లు త్వరలో విడుదల చేయనున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. మిగిలిన సుమారు రూ.2,500 కోట్లు వినియోగ ధృవపత్రాల సమర్పణ ఆధారంగా దశలవారీగా విడుదల చేస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో ప్రజాస్వామ్య సంస్థలు బలపడితే బాధ్యత, పారదర్శకత పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం విశ్వసిస్తోందని కిషన్ రెడ్డి అన్నారు. అందుకే స్థానిక సంస్థలకు నిధులను సకాలంలో విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో నిధులను మళ్లించారు

ఇదే సమయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కేటాయించిన నిధులను ఇతర అవసరాలకు మళ్లించిందని ఆయన ఆరోపించారు. నిబంధనల ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీ ప్రత్యేక బ్యాంకు ఖాతా నిర్వహించాల్సి ఉండగా, ఆ ఖాతాలను అటాచ్ చేసి నిధులను మళ్లించడంతో పలు చోట్ల సర్పంచులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. కొందరు సర్పంచులు నిధులు అందక రాజీనామా చేయగా, కొన్ని విషాద ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి, గ్రామ స్థాయి పాలన బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వ ప్రయత్నాలకు తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.

బ్రిటిషర్ల మాదిరిగా కాంగ్రెస్ పాలన: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడే ముందు తన పార్టీ చరిత్రను అధ్యయనం చేయాలని సూచించారు. నేడు దేశంలో నిజమైన ప్రజాస్వామ్యం, ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ స్వాతంత్ర్యం ఉందని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడిన రాంచందర్ రావు, రాహుల్ గాంధీ అమ్మమ్మ ఇందిరా గాంధీ కాలంలో న్యాయవ్యవస్థపై గౌరవం చూపలేదని, దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగ సంస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఆ సమయంలో ఒకే వ్యక్తి పాలన కొనసాగిందని ఆయన వ్యాఖ్యానించారు.

ఆ కాలంలో ప్రజాస్వామ్యం అంటే ఏమిటో రాహుల్ గాంధీ చెప్పాలి. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం బ్రిటిష్ పాలకుల్లాగే వ్యవహరించింది. నేడు దేశం ప్రజాస్వామ్య నాయకత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ కింద నడుస్తోంది. నిజమైన ప్రజాస్వామ్యం, నిజమైన ఆర్థిక స్వేచ్ఛ, రాజకీయ స్వాతంత్ర్యం ఇప్పుడు భారతదేశంలో ఉందని అన్నారు. రాహుల్ గాంధీ ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వ్యాఖ్యానించిన నేపథ్యంలో రాంచందర్ రావు స్పందించారు. ప్రజాస్వామ్య సంస్థలు, ఎన్నికల సంఘంపై దాడులు జరుగుతున్నాయని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు.

తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కిందని, ఈ పరిస్థితుల్లోనే రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారని బీజేపీ నేతలు పేర్కొన్నారు. రాష్ట్రంలో డీఎంకే–కాంగ్రెస్ కూటమి, బీజేపీ–ఏఐఏడీఎంకే కూటమి, అలాగే కొత్తగా రంగప్రవేశం చేసిన తమిళ వెట్రి కజగం మధ్య త్రిముఖ పోటీ నెలకొందని వారు తెలిపారు.