Let's talk: editor@tmv.in
తెలంగాణ నూత‌న‌ గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం

తెలంగాణ నూత‌న‌ గవర్నర్‌కు సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం

Gaddamidi Naveen
11 మార్చి, 2026

తెలంగాణ నూతన గవర్నర్‌గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా మంగళవారం హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనస్వాగతం పలికారు.

ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు, డీజీపీ బి. శివధర్ రెడ్డి తదితరులు విమానాశ్రయంలో నూతన గవర్నర్‌కు సాదర స్వాగతం పలికారు. గతంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా సేవలందించిన శివ ప్రతాప్ శుక్లా, నేడు తెలంగాణ గవర్నర్‌గా అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రాష్ట్ర ప్రథమ పౌరుడిగా ఆయన నియామకంపై అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటి వరకు ఇక్కడ గవర్నర్‌గా ఉన్న జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ అయ్యారు.

బడ్జెట్ సమావేశాల వేళ ఈ నియామకం కీలకం. మార్చి 16న అసెంబ్లీ ప్రారంభం కానుండగా, తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి నూతన గవర్నర్ ప్రసంగించనున్నారు. శివ ప్రతాప్ శుక్లా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఆయన గతంలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా, కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు.