Let's talk: editor@tmv.in
తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి: హరీష్ రావు

తెలంగాణ నీటి హక్కులను ఏపీకి దారాదత్తం చేస్తున్న రేవంత్ రెడ్డి: హరీష్ రావు

Gaddamidi Naveen
13 జనవరి, 2026

పోలవరం - నల్లమల సాగర్ ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుసరిస్తున్న తీరు తెలంగాణ ప్రయోజనాలకు గొడ్డలిపెట్టుగా మారిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణకు అర్హత లేదని తేలిపోవడంతో, రేవంత్ రెడ్డి "ద్రోహ బుద్ధి" సాక్షిగా బయటపడిందని ఆయన విమర్శించారు.

హ‌రీష్ రావు మాట్లాడుతూ, నాడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో రైతులు వేసిన రిట్స్ ద్వారా ఏపీ ప్రభుత్వ పనులకు స్టే సొంతం చేసుకున్న సందర్భాన్ని గుర్తుచేశారు. కానీ, పోలవరం – నల్లమల సాగర్ సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఉద్దేశపూర్వకంగా విచారణ అర్హత లేని పిటిషన్ వేసి తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని మీ న్యాయవాది, మీ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ కి తెలియదు అనుకోవచ్చా? దీని కోసమేనా నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూటు బూటు వేసుకొని ఢిల్లీకి వెళ్ళింది? అని హరీష్ రావు ఎద్దేవా చేశారు.

రేవంత్ రెడ్డి మన నీటి హక్కులను ఏపీకి మార్గదర్శకంగా ఇచ్చే విధంగా వ్యవహరిస్తోందని ధ్వనించారు. ఆయన ప్రకారం, రిట్స్ ఉపసంహరణ చేసుకుని సివిల్ సూట్ ఫైల్ చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వం చెప్పడం అంటే, పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీకి గడువు ఇవ్వడమే అవుతుందని అన్నారు. రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టు పనులలో ఏపీకి పూర్తిగా సహకరిస్తోంది. పోను పోను అనుకుంటూ రేవంత్ రెడ్డి డిల్లీ మీటింగ్‌కు వెళ్ళాడు. ఎజెండాలో లేకపోయినా బనకచర్లపై చర్చ జరిపి, సంతకం పెట్టి తెలంగాణ నదీ జలాలకు మరణశాసనం రాశాడు. వెయను అంటూనే కమిటీలను ఏర్పాటు చేసి, ఏపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ వేసాడు. టెండర్ చివరి తేదీ అయిపోయాక సుప్రీం కోర్టుకు వెళ్లి నల్లమల సాగర్ ప్రాజెక్టుకు పరోక్షంగా అంగీకారం తెలిపాడు అని హరీష్ ఆరోపించారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాస్లేని పిటిషన్ ద్వారా తెలంగాణకు మోసం చేసి, పంచాయతీలు లేదా న్యాయస్థానాలను పక్కన పెట్టి మనమే చర్చించుకుందాం అని చెప్పడం అనేది తెలంగాణ నీటి హక్కులను ఏపీకి అప్పిచ్చే ప్రయత్నమే అని పేర్కొన్నారు. తెలంగాణలోని కృష్ణా, గోదావరి నదులపై చంద్రబాబు, ఆంధ్రా ప్రభుత్వం అడ్డుకోని ప్రాజెక్టులు ఉన్నాయా? అలాంటి చంద్రబాబుతో స్నేహం కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డి పాలనను ప్రజా సమాజం క్షమించదు అని తెలిపారు.

చంద్రబాబుకు 'సంక్రాంతి గిఫ్ట్'

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఉన్న స్నేహం కోసమే రేవంత్ రెడ్డి ఈ నాటకానికి తెరలేపారని హరీష్ రావు విమర్శించారు. రిట్ ఉపసంహరించుకొని, సివిల్ సూట్ ఫైల్ చేస్తామని చెప్పడం అంటే ఏపీకి ప్రాజెక్టు పూర్తి చేసుకోవడానికి గడువు ఇవ్వడమేనని విశ్లేషించారు. మహారాష్ట్ర, కర్ణాటక వాదనలు కూడా వినాల్సి వస్తే ఈ కథ ఏళ్ల తరబడి సాగుతుందని, ఈలోగా ఏపీ నీళ్లను తరలించుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో వేసిన ఈ బలహీనమైన పిటిషన్ రేవంత్ రెడ్డి తన 'గురువు' చంద్రబాబుకు ఇచ్చిన సంక్రాంతి కానుక అని ఆయన వర్ణించారు.

బీఆర్ఎస్ పోరాటం ఖాయం

రేవంత్ రెడ్డి నీ గురుదక్షిణ కోసం తెలంగాణకు ద్రోహం చేస్తుంటే చూస్తూ ఊరుకోం. తెలంగాణను సాధించిన బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో నీ దుర్మార్గాన్ని ఎండగడుతుంది. నీటి హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరు చేస్తాం అని హరీష్ రావు హెచ్చరించారు.