
తెలంగాణ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా సోమవారం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఇందులో సుమారు 73 లక్షల మంది పేర్లు చోటు దక్కించుకోలేదు. మరో 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి. సుధర్శన్రెడ్డి తెలిపారు. జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు జరిగిన ఎన్యూమరేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని మొత్తం 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,87,213 మంది ఎన్యూమరేషన్ ఫారాలను సమర్పించారు. మిగిలిన వారిలో సుమారు 73 లక్షల పేర్లు గైర్హాజరు, వేరే ప్రాంతానికి తరలివెళ్లిన, మరణించిన లేదా డూప్లికేట్ ఓటర్లు (ఏఎస్డీడీ) జాబితాలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
అర్హత ఉన్న ఓటర్లు తమ పేర్లను మళ్లీ చేర్చుకునేందుకు అవకాశం ఉంది. ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 వరకు జరిగే క్లెయిమ్స్, అభ్యంతరాల గడువులో ఫారం-6తో పాటు నిర్దేశిత డిక్లరేషన్ ఫారం సమర్పించి ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవచ్చు.
92 లక్షల మందికి నోటీసులు
ఎస్ఐఆర్లో భాగంగా మరో 92 లక్షల మందికి నోటీసులు ఇవ్వనున్నారు. వీరిలో సుమారు 60 లక్షల మంది ‘అనామలీస్’ కేటగిరీలో, మరో 32 లక్షల మంది ‘అన్మ్యాప్డ్’ కేటగిరీలో ఉన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో తమ వివరాలకు సంబంధాన్ని నిర్ధారించలేని వారిని అన్మ్యాప్డ్ కేటగిరీలో చేర్చారు. నోటీసులు అందుకున్న వారు ఎన్యూమరేషన్ ఫారం వెనుక పేర్కొన్న అవసరమైన పత్రాలను విచారణ సమయంలో సమర్పించవచ్చని ఎన్నికల సంఘం తెలిపింది.
నోటీసు ఇవ్వకుండా పేరు తొలగించొద్దు
ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏ ఓటరు పేరును తొలగించాలన్నా ముందుగా నోటీసు ఇవ్వాలని, విచారణ నిర్వహించి సంబంధిత వ్యక్తికి తన వాదన వినిపించే న్యాయమైన అవకాశం కల్పించాలని సీఈఓ కార్యాలయం స్పష్టం చేసింది.
ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్ఓ) నిర్ణయంపై అసంతృప్తి ఉన్నవారు 15 రోజుల్లో జిల్లా మేజిస్ట్రేట్/జిల్లా ఎన్నికల అధికారికి అప్పీల్ చేసుకోవచ్చు. అక్కడి నిర్ణయంపై అసంతృప్తి ఉంటే, సంబంధిత నిబంధనల ప్రకారం 30 రోజుల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి రెండో అప్పీల్ చేసుకునే అవకాశం ఉంది.
నోటీసుల జారీ, క్లెయిమ్స్, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు.
