
తెలంగాణ డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ యత్నం.. నాయకుల అరెస్ట్
నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో తమ పార్టీ అభ్యర్థి మహదేవప్ప ఆత్మహత్యకు కాంగ్రెస్ కారణమంటూ బీజేపీ మంగళవారం ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయం ముట్టడికి పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీసింది.
యువ గిరిజన నాయకుడు, బీజేపీ వార్డ్–6 అభ్యర్థి ఎరుకల మహాదేవప్ప మరణానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా నిరసనకారులు మహాదేవప్ప మరణంపై సమగ్రంగా, పారదర్శకంగా దర్యాప్తు జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
బీజేపీ నాయకులు మాట్లాడుతూ, మహాదేవప్ప నిరంతర రాజకీయ ఒత్తిళ్లు బెదిరింపులకు గురయ్యారని ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు ఆరోపిస్తున్నారని తెలిపారు. ఈ ఆరోపణలను దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలుగులోకి తేవాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి గతంలోనూ వివాదాస్పదంగా ఉందని వారు విమర్శించారు.
నిరసన కార్యక్రమం సందర్భంగా కొందరు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. మహాదేవప్ప మరణంపై వివిధ రాజకీయ పార్టీల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా, మహాదేవప్ప కుటుంబ సభ్యులు న్యాయం కోరుతూ పూర్తి స్థాయి దర్యాప్తు జరిపించాలని కోరుతున్నారు. ఈ ఘటనపై అధికారికంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. నిజాలు బయటకు రావాలని, బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని పలువురు సామాజిక వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.
