Let's talk: editor@tmv.in
తెలంగాణ డీజీపీతో డీఎస్పీ మహ్మద్ సిరాజ్ భేటీ

తెలంగాణ డీజీపీతో డీఎస్పీ మహ్మద్ సిరాజ్ భేటీ

Gaddamidi Naveen
22 జులై, 2026

భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్, తెలంగాణ పోలీసు శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా విధులు నిర్వహిస్తున్న మహ్మద్ సిరాజ్ మంగళవారం హైదరాబాద్‌లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అధికారిక ప్రోటోకాల్ పర్యటనలో భాగంగా ఈ భేటీ జరిగింది.

సిరాజ్ ప్రయాణంపై డీజీపీ ప్రశంసలు

ఈ భేటీకి సంబంధించిన వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ తన సామాజిక మాధ్యమ ఖాతా 'ఎక్స్' వేదికగా పంచుకున్నారు. హైదరాబాద్ క్రికెట్ ఆరంభ రోజుల్లో సాధారణ టెన్నిస్ బాల్ క్రికెటర్ స్థాయి నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ప్రధాన పేస్ బౌలర్ గా ఎదిగిన సిరాజ్ ప్రయాణాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. 2013-14లో మాజీ క్రికెటర్, అప్పటి సెలెక్టర్ అబ్దుల్ అజీమ్ తనను సిరాజ్ ఆటను పరిశీలించాలని కోరారని, అప్పుడే అతని ప్రతిభ తనను ఆకట్టుకుందని డీజీపీ పేర్కొన్నారు. ఆ తర్వాత సిరాజ్‌ను వెంటనే రెండు రోజుల లీగ్ మ్యాచ్‌ల్లో ఆడించారని, 2015లో మూడు రోజుల లీగ్‌లలోనూ అవకాశాలు లభించాయని చెప్పారు. అతని వేగం, కచ్చితత్వం కారణంగా రంజీ ట్రోఫీ జట్టులో చోటు సంపాదించాడని తెలిపారు.

2016-17 రంజీ ట్రోఫీ సీజన్‌లో సిరాజ్ 41 వికెట్లు తీసి వెనుతిరిగి చూడలేదని తెలిపారు. కఠినమైన ప్రతికూలతలను దాటుకుని అన్ని అంతర్జాతీయ క్రికెట్ ఫార్మాట్లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించడం అతడి క్రమశిక్షణ, కృషికి తార్కాణమని కొనియాడారు. సిరాజ్‌ను హైదరాబాద్‌కు చెందిన అమూల్యమైన క్రీడా నక్షత్రంగా అతన్ని అభివర్ణించారు. భవిష్యత్తులోనూ భారత జట్టు తరఫున మరెన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు చేయాలని ఆకాంక్షించారు.

హోదా నేపథ్యం - కెరీర్ మైలురాళ్లు

టీమిండియా 2024 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్‌ గెలిచిన అనంతరం, తెలంగాణ ప్రభుత్వం సిరాజ్‌కు డీఎస్పీ ఉద్యోగాన్ని కేటాయించింది. దీనితో ఆయన అక్టోబర్ 11, 2024న అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్ విధానంలో భాగంగా బీసీసీఐ మెడికల్ టీమ్ విశ్రాంతి సూచించడంతో ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు సిరాజ్ దూరంగా ఉన్నారు.

2017 నవంబర్ 4న న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన సిరాజ్ ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 233 వికెట్లు పడగొట్టారు. ఇందులో టెస్టుల్లో 140, వన్డేల్లో 76, టీ20ల్లో 17 వికెట్లు ఉన్నాయి. 2023 ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకపై 6 వికెట్లకు 21 పరుగులు ఇచ్చి మ్యాచ్‌ను మలుపుతిప్పడంతో పాటు ఒకే ఓవర్‌లో నాలుగు వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా చరిత్ర సృష్టించారు. 2020-21 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాపై భారత్ సాధించిన చారిత్రక విజయంలోనూ కీలక పాత్ర పోషించారు. ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరాజ్, గతంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున కూడా ఆడారు. 125 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 128 వికెట్లు సాధించిన ఆయన, 2023 జనవరిలో ఐసీసీ వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్-1 స్థానాన్ని కూడా అధిరోహించారు.