
తెలంగాణ గ్రూప్-2 తుది ఫలితాలు విడుదల
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గ్రూప్-2 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలను ఆదివారం అధికారికంగా ప్రకటించింది. మొత్తం 18 రకాల పోస్టులకు సంబంధించి ఎంపికైన వారి జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది. మొత్తం 783 పోస్టులకు గాను, కమిషన్ 782 మంది అభ్యర్థులను తుది జాబితాకు ఎంపిక చేసింది. ఒక పోస్టును హోల్డ్‌లో పెట్టింది.
వివరాల్లోకెళ్తే.. 2022 డిసెంబర్ 29న 783 గ్రూప్-2 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. వీటిలో ముఖ్యంగా అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, సబ్-రిజిస్ట్రార్ గ్రేడ్-2, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-3, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ వంటి కీలక పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాల కోసం రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రాత పరీక్ష అనేకసార్లు వాయిదా పడిన తర్వాత, చివరకు 2024 డిసెంబర్ 15, 16 తేదీల్లో నాలుగు సెషన్లలో విజయవంతంగా నిర్వహించారు. ఈ పరీక్షలో అభ్యర్థులు చూపిన ప్రతిభ ఆధారంగా మార్చి 2025లో జనరల్ ర్యాంకింగ్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ లిస్ట్‌లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు వివిధ దశల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించారు. ధ్రువ పత్రాల పరిశీలన పూర్తి చేసుకున్న అభ్యర్థులు ఇచ్చిన ఆప్షన్లు, మెరిట్ ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా తుది మెరిట్ జాబితాను కమిషన్ రూపొందించింది. ఈ పరీక్షల్లో 600 మార్కులకు గాను అత్యధికంగా 447.08 మార్కులు నమోదైనట్లు కమిషన్ తెలిపింది.
ఫలితాల విడుదలపై టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం మాట్లాడుతూ, పరీక్షలు నిర్వహించిన 10 నెలల్లోనే తుది ఫలితాలు ఇచ్చామని, గ్రూప్-1 వివాదం లేకపోయి ఉంటే ఫలితాలు మరింత తొందరగా వచ్చేవని అన్నారు. ఎంపికైన అభ్యర్థుల జాబితా, కటాఫ్ మార్కుల వివరాలు అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inలో అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్‌తో ఫలితాలను చెక్ చేసుకోవాలని కమిషన్ సూచించింది.
