Let's talk: editor@tmv.in
తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

Dantu Vijaya Lakshmi Prasanna
6 ఫిబ్రవరి, 2026

తెలంగాణ ప్రభుత్వానికి, గ్రూప్-1 అభ్యర్థులకు రాష్ట్ర హైకోర్టులో భారీ ఊరట లభించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల విషయంలో గతంలో వెలువడిన సింగిల్ జడ్జి తీర్పును చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టివేసింది.

నియామక ప్రక్రియ అంతా అత్యంత పారదర్శకంగా జరిగిందని, పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినట్లు ఆధారాలు లేవని ధర్మాసనం తన తుది తీర్పులో స్పష్టం చేసింది. ఈ తీర్పుతో ఇప్పటికే అపాయింట్‌మెంట్ లెటర్లు అందుకున్న 563 మంది అభ్యర్థుల ఉద్యోగాలకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి.

గతంలో సింగిల్ జడ్జి బెంచ్ గ్రూప్-1 ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ, సమాధాన పత్రాలను తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా మెయిన్స్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. 2024 అక్టోబర్‌లో నిర్వహించిన మెయిన్స్ పరీక్షలో పత్రాల మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని, ప్రిలిమ్స్, మెయిన్స్‌కు వేర్వేరు హాల్ టికెట్లు జారీ చేయడం నిబంధనలకు విరుద్ధమని కొందరు అభ్యర్థులు దాఖలు చేసిన పిటిషన్లపై సింగిల్ జడ్జి ఆ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, ఈ తీర్పును సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ ఎంపికైన అభ్యర్థులు డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించగా, సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు ప్రభుత్వం వైపు నిలిచింది.

న్యాయస్థానంలో జరిగిన వాదనల సందర్భంగా అడ్వొకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ప్రభుత్వం తరఫున కీలక అంశాలను వెల్లడించారు. మూల్యాంకనంలో పొరపాట్లు జరగకుండా ఉండేందుకు ఇద్దరు నిపుణులతో దిద్దించామని, పరిపాలనా సౌలభ్యం కోసమే వేర్వేరు హాల్ టికెట్లు ఇచ్చామని వివరించారు. అర్హత సాధించిన అభ్యర్థుల తరఫు న్యాయవాదులు వాదిస్తూ, పరీక్షా నిబంధనలు ముందే తెలిసినా ఫలితాలు వచ్చాక కోర్టుకు రావడం సరైనది కాదని పేర్కొన్నారు. ఈ వాదనలతో ఏకీభవించిన డివిజన్ బెంచ్, నియామకాలు సక్రమమేనని తేల్చి చెప్పింది.

కోర్టు తీర్పుపై రేవంత్ రెడ్డి హర్షం

హైకోర్టు తీర్పుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు పన్నినా అంతిమంగా న్యాయమే గెలిచిందని, అభ్యర్థుల భవిష్యత్తును అడ్డుకోవాలని చూసిన వారికి ఇది చెంపపెట్టు అని ఆయన అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గ్రూప్-1 అధికారులుగా నియమితులవుతున్న 563 మందికి అభినందనలు తెలుపుతూ, రాష్ట్ర పునర్నిర్మాణంలో వారు కీలక పాత్ర పోషించాలని తన సోషల్ మీడియా ఎక్స్ ఖాతాలో పిలుపునిచ్చారు. ఈ తీర్పుతో గత కొంతకాలంగా అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలకు తెరపడింది

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట - Tholi Paluku