
తెలంగాణ గిగ్ వర్కర్లకు శుభవార్త – కనీస వేతనం, భద్రత కోసం కొత్త బిల్లు
స్విగ్గి, జొమాటో, ఉబర్, ఓలా వంటి ప్లాట్‌ఫారమ్‌లలో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 12న జరగనున్న రాష్ట్ర సచివాలయంలోని కేబినెట్ సమావేశంలో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి వెల్లడించారు.గిగ్ వర్కర్ల సామాజిక భద్రత, కనీస వేతనం హక్కులను నిర్ధారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక బిల్లును ప్రవేశపెట్టనుంది.
ప్రస్తుతం రాష్ట్రంలో వేలాదిమంది యువకులు ఆన్‌లైన్ డెలివరీ, క్యాబ్ డ్రైవింగ్, లోజిస్టిక్స్ వంటి రంగాల్లో గిగ్ వర్కర్లుగా పని చేస్తున్నారు. వీరికి స్థిరమైన వేతనం, వైద్య బీమా, ప్రమాద భద్రత, పెన్షన్ వంటి సదుపాయాలు లేని కారణంగా ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు ప్రభుత్వం సమగ్ర చట్టాన్ని రూపొందించింది.
ప్రతిపాదిత బిల్లులో గిగ్ వర్కర్ల కోసం ప్రత్యేక సోషల్ సెక్యూరిటీ బోర్డు ఏర్పాటు చేయనుంది. ఈ బోర్డు ద్వారా బీమా, ఆరోగ్య సదుపాయాలు, ప్రమాద పరిహారం, పింఛను వంటి పథకాలను అమలు చేస్తారు. అంతేకాకుండా, ప్రతి గిగ్ వర్కర్‌కి కనీస ఆదాయం హామీ కల్పించే విధంగా కంపెనీలపై బాధ్యతలు విధించనున్నారు. డెలివరీ లేదా ట్రిప్ ఆధారంగా మాత్రమే కాకుండా, గంటల లేదా రోజువారీ కనీస వేతనం కూడా నిర్ధారించే దిశగా చట్టం రూపుదిద్దుకుంటోంది.
గిగ్ వర్కర్లకు ఇది ఒక పెద్ద ఉపశమనం అవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ చట్టం ద్వారా వర్కర్లకు ఆర్థిక స్థిరత్వం కలిగించి, ప్లాట్‌ఫారమ్ కంపెనీలతో ఉన్న అనిశ్చిత సంబంధాలను సరిదిద్దే అవకాశం ఉందని భావిస్తున్నారు.సాంకేతిక ఆధారిత సేవల్లో తెలంగాణ ముందంజలో ఉన్న రాష్ట్రం కావడంతో, ఈ బిల్లు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల హక్కుల పరిరక్షణలో ఆదర్శంగా నిలవవచ్చు అని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
గిగ్ వర్కర్ అంటే ఎవరు?
ఈ బిల్లులో “గిగ్ వర్కర్” అనే పదాన్ని “యాప్ లేదా ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్ ద్వారా తాత్కాలికంగా లేదా పనివారీగా సేవలు అందించే వ్యక్తిగా నిర్వచించారు.
అంటే స్విగ్గి, జొమాటో డెలివరీ బాయ్స్, ఓలా, ఉబర్ డ్రైవర్లు, అమెజాన్ లాజిస్టిక్స్ సిబ్బంది. వీరందరూ ఈ వర్గంలోకి వస్తారు.
కనీస వేతనం, వెల్ఫేర్ ఫండ్
ప్రస్తుతం గిగ్ వర్కర్లకు ఖచ్చితమైన కనీస వేతనం నిర్ణయించకపోయినా, ప్రభుత్వం వర్గాలవారీగా కనీస ఆదాయం హామీ ఇవ్వాలని నిర్ణయించింది.ఈ పథకాల అమలుకు ప్రత్యేక “గిగ్ వర్కర్స్ వెల్ఫేర్ ఫండ్” ఏర్పాటు చేయనున్నారు. దీనికి ప్రభుత్వం, కంపెనీలు, వర్కర్లు తలో భాగం చెల్లిస్తారు.
సామాజిక భద్రతా ప్రయోజనాలు
జీవిత, ప్రమాద బీమా,ఆరోగ్య బీమా, మెడికల్ క్లెయిమ్స్, మహిళా వర్కర్లకు ప్రసూతి భత్యం,వయస్సు పెరిగిన తర్వాత పెన్షన్ హక్కు,అత్యవసర పరిస్థితుల్లో ఆర్థిక సహాయం,ప్రభుత్వ పథకాల కింద ఆరోగ్య సాయం.ఈ ప్రయోజనాలను పర్యవేక్షించేందుకు ప్రత్యేక సోషల్ సెక్యూరిటీ బోర్డు ఏర్పాటు కానుంది.
కంపెనీల బాధ్యతలు
స్విగ్గి, జొమాటో, ఓలా, ఉబర్ వంటి సంస్థలు తమ వ్యాపార నమూనాల్లో భారీ మార్పులు చేయాల్సి ఉంటుంది.గిగ్ వర్కర్లను రిజిస్టర్డ్ వర్కర్లుగా గుర్తించడం,అలాగే కనీస వేతనం, బీమా చెల్లింపులు నిర్ధారించాలి.ప్రతి ఆర్డర్ లేదా ట్రిప్‌పై వెల్ఫేర్ ఫండ్‌కి శాతం చెల్లించడం.వర్కర్లపై ప్రభావం చూపే ఆల్గోరిథమ్స్‌ను పారదర్శకంగా ఉంచాలి.కంపెనీలు, వర్కర్లు, ప్రభుత్వం కలిసి చట్ట అమలు పర్యవేక్షించేందుకు ట్రిపార్టైట్ కమిటీ ఏర్పాటవుతుంది. ఇది గిగ్ వర్కర్ల సమస్యలను పరిశీలించి త్వరిత పరిష్కారం చూపుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లుతో “ఉద్యోగం లేకున్నా, జీవన భద్రత ఉండాలి” అనే సూత్రాన్ని ముందుకు తెస్తోంది.ఇది దేశంలోనే గిగ్ వర్కర్ల హక్కులను చట్టబద్ధంగా రక్షించే ముందడుగుగా నిలవనుంది. ఇతర రాష్ట్రాలకు కూడా ఇది ఆదర్శంగా మారే అవకాశం ఉంది.
జాతీయ స్థాయి
భారత ప్రభుత్వం “కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ – 2020”లో గిగ్, ప్లాట్‌ఫారమ్ వర్కర్లను ప్రత్యేకంగా గుర్తించింది.అయితే, దేశంలో ఈ కోడ్ ఇంకా పూర్తిగా అమల్లోకి రాలేదు.దీనిలో గిగ్ వర్కర్లకు బీమా, పెన్షన్, ఇతర ప్రయోజనాలు కల్పించాల్సిన నిబంధనలు ఉన్నప్పటికీ,వాటి అమలు విధానాలు ఇంకా ప్రకటించలేదు.అందువల్ల కేంద్ర స్థాయిలో చట్టం ఉన్నా, ప్రాక్టికల్ అమలు ఇంకా ప్రారంభం కాలేదు. ఇతర రాష్ట్రల్లో కూడా ఇంకా అమలు కాలేదు.ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఈ బిల్లు ప్రవేశపెట్టబోతుంది.దీని అమలు ఏవిధంగా ఉంటుందో చూడాలి.
