
తెలంగాణ గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర ఐదో గవర్నర్‌గా శివప్రతాప్ శుక్లా బుధవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్‌లోని లోక్ భవన్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. విశేషమేమిటంటే, ఉత్తరప్రదేశ్‌కు చెందిన శుక్లా తెలుగులో ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రివర్గ సహచరులు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. అంతకుముందు హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన శుక్లాకు, మంగళవారం హైదరాబాద్ చేరుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి ఘనస్వాగతం పలికారు. ఆయన జిష్ణు దేవ్ వర్మ స్థానంలో నియమితులయ్యారు. కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రాష్ట్ర రాజకీయ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు.
శివప్రతాప్ శుక్లా రాజకీయ నేపథ్యం
ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లాలోని రుద్రాపూర్‌కు చెందిన శుక్లా రాజకీయ జీవితాన్ని విద్యార్థి దశలోనే ప్రారంభించారు. ఆయన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా ప్రజా జీవితంలోకి వచ్చారు. తరువాత 1983లో బీజేపీలో చేరి రాజకీయంగా ఎదిగారు. 1989, 1991, 1993, 1996లో వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర రాజకీయాల్లో ప్రాధాన్యం పొందారు. తరువాత 2016లో ఆయన రాజ్యసభకుకు ఎన్నికయ్యారు. గతంలో కేంద్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న శివప్రతాప్ శుక్లా రాకతో లోక్ భవన్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సమన్వయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
తెలంగాణ గవర్నర్ల వరుస క్రమం..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు ఉన్న గవర్నర్లు
• ఈ.ఎస్.ఎల్. నరసింహన్ (2014–2019)
• తమిళిసై సౌందరరాజన్ (2019–2024)
• సి.పి. రాధాకృష్ణన్ (2024, అదనపు బాధ్యతలు)
• జిష్ణు దేవ్ వర్మ (2024–2026)
• శివప్రతాప్ శుక్లా (2026–ప్రస్తుతం)
