Let's talk: editor@tmv.in
తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ ఏటీఎంలా మారింది: కేటీఆర్

తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ ఏటీఎంలా మారింది: కేటీఆర్

Gaddamidi Naveen
3 మార్చి, 2026

తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం మరోసారి ముదిరింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ తన సొంత 'ఏటీఎం'లా మార్చుకుందని ఆరోపిస్తూ ఆయన 'ఎక్స్' (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

రూ.1000 కోట్ల వసూళ్ల కోసమేనా?

కేటీఆర్ చేసిన పోస్టులో, హలో రాహుల్ గాంధీ… ఏఐసీసీ ఏటీఎం తెలంగాణకు స్వాగతం. మా సీఎం వాగ్దానం చేసిన రూ.1,000 కోట్లను సేకరించేందుకే వచ్చారా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో 100 రోజుల్లో అమలు చేస్తామని హామీ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలుపై సమీక్ష చేస్తారా? అలాగే ప్రజలకు ఇచ్చిన 420 హామీల పురోగతిపై మాట్లాడతారా? సమీక్షించే ధైర్యం మీకు ఉందా అని ఆయన నిలదీశారు.

రాహుల్ గాంధీ వికారాబాద్ పర్యటన

ఇదిలా ఉండగా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సోమవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ ఎంపీ కే.సి. వేణుగోపాల్ కూడా ఉన్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం వారు వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండలకు బయలుదేరారు. అక్కడ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ డిసిసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు.

తెలంగాణ కాంగ్రెస్‌కు ఏఐసీసీ ఏటీఎంలా మారింది: కేటీఆర్ - Tholi Paluku