Let's talk: editor@tmv.in
తెలంగాణ ఐసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

తెలంగాణ ఐసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల

Shaik Mohammad Shaffee
28 సెప్టెంబర్, 2025

తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీ ఐసెట్‌) 2025 కౌన్సెలింగ్‌కు సంబంధించిన కీలక ప్రకటన విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ప్రత్యేక దశ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి తాజాగా ప్రకటించింది. ఇప్పటివరకు సీటు పొందని లేదా మెరుగైన కళాశాలలో సీటు ఆశించే విద్యార్థులకు ఇది చివరి అవకాశం. ఐసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్ అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. అక్టోబర్ 6న సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌, 6, 7 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఉంటాయని ఐసెట్‌ ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఏ. శ్రీదేవసేన తెలిపారు.

ఐసెట్ 2025 పరీక్షలో అర్హత సాధించి, ఇంతవరకు కౌన్సెలింగ్‌లో పాల్గొనని విద్యార్థులు, గతంలో కౌన్సెలింగ్‌కు హాజరై, సీటు రాని లేదా సీటు పొందినా జాయిన్ కాని అభ్యర్థులు, గతంలో సీటు పొంది, ఆ సీటును రద్దు చేసుకున్న విద్యార్థులు, మొదటి/ తుది దశ కౌన్సెలింగ్‌లో సీటు పొంది, మెరుగైన కళాశాలలో ప్రవేశం కోసం ప్రయత్నించాలనుకునే అభ్యర్థులు (వీరు మళ్లీ వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది), గతంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసి, వెబ్ ఆప్షన్స్ ఇవ్వని లేదా ఆప్షన్స్ ఇచ్చినా సీటు రాని వారు స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌కు అర్హులు. ఈ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ ముగిసిన తర్వాత ఎలాంటి కౌన్సెలింగ్‌లు నిర్వహించారు. కాబట్టి ఎంబీఏ లేదా ఎంసీఏ కోర్సుల్లో చేరాలనుకునే అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని తప్పక ఉపయోగించుకోవాలి.

అవసరమైన పత్రాలు

టీజీ ఐసెట్ 2025 ర్యాంక్ కార్డు, టీజీ ఐసెట్ 2025 హాల్ టికెట్, ఆధార్ కార్డు, డిగ్రీ మార్కుల మెమోలు & ప్రొవిజనల్/డిగ్రీ సర్టిఫికెట్, 10వ తరగతి, ఇంటర్ మార్కుల మెమోలు, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం (అవసరమైతే), ఆదాయ ధృవీకరణ పత్రం (అవసరమైతే), మైనారిటీ సర్టిఫికెట్ (అవసరమైతే), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం తెలంగాణ ఐసెట్ అధికారిక వెబ్‌సైట్ https://tgicet.nic.inను సందర్శించండి.

తెలంగాణ ఐసెట్‌ స్పెషల్‌ ఫేజ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల - Tholi Paluku