Let's talk: editor@tmv.in
తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగు ‘విజయ్ దివాస్’: కేటీఆర్

తెలంగాణ ఏర్పాటుకు తొలి అడుగు ‘విజయ్ దివాస్’: కేటీఆర్

Gaddamidi Naveen
10 డిసెంబర్, 2025

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో డిసెంబర్ 9 ఒక చారిత్రక ప్రాధాన్యత ఉంది. రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజుగా 'విజయ్ దివస్' (విజయ దినోత్సవం)గా పరిగణిస్తారు. నిన్న‌టికి సరిగ్గా 16 ఏళ్లు పూర్తయ్యింది.ఈ సంద‌ర్బంగా మాజీమంత్రి కేటీఆర్ త‌న ఎక్స్ వేదిక ద్వారా సర్వసామాజిక వర్గాల నిరంతర పోరాటం, వేలాది మంది ఉద్యమకారుల త్యాగాలు, అమరుల రక్తసాక్ష్యం, ముఖ్యంగా అప్పటి టీఆర్‌ఎస్ (ప్రస్తుత బీఆర్‌ఎస్) అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి చివరకు రాష్ట్ర విభజన దిశగా తొలి నిర్ణయం వెలువడేలా చేసింది.

ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది.ఈ పోరాట ఫలితంగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 9, 2009 నాడు అధికారికంగా ప్రకటించిందని ఆయ‌న తెలిపారు.ప్రజా జ్వాల, ఉద్యమ సంకల్పానికి నిదర్శనంగా నిలిచిందన్నారు. ఈ చారిత్రక ప్రకటన వెనుక నవంబర్ 29న ప్రారంభమైన కేసీఆర్ దీక్ష కీలక మలుపుగా నిలిచిందని ఉద్యమ నేతలు గుర్తుచేసుకుంటున్నారు. “దీక్షా దివస్ లేకుంటే విజయ్ దివస్ లేదు… విజయ్ దివస్ లేకుంటే జూన్ 2 తెలంగాణ లేదు” అని కేటీఆర్ అన్నారు.

డిసెంబర్ 9 తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలు : హరీష్ రావు

దశాబ్దాల ఆశ, ఆవేదనతో కూడిన నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారి, ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నాయకులు హరీష్ రావు పేర్కొన్నారు. నవంబర్ 29న మొదలైన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు ప్రత్యక్ష ప్రతిఫలం. ఆ దీక్షతో ఉద్యమం ఉప్పొంగగా దేశవ్యాప్తంగా తెలంగాణ డిమాండ్ ప్రతిధ్వనించగా, చివరకు కేంద్రం రాష్ట్ర ఏర్పాటుపై ప్రక్రియను ప్రారంభించేలా వచ్చింది. నవంబర్ 29 దీక్ష దివాస్, డిసెంబర్ 9 విజయ్ దివాస్, జూన్ 2, 2014 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఈ రోజులు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైనవి, అని ఆయన అన్నారు. కేసీఆర్ పోరాటం నాలుగు కోట్ల ప్రజల చైతన్యం కలయికే తెలంగాణ ఉద్యమ చరిత్ర అని ఆయన పేర్కొన్నారు.

కేసీఆర్ నేతృత్వం, లక్షలాది ప్రజల త్యాగాలు, విద్యార్థుల ఉద్యమాలు, అమరుల రక్తసాక్ష్యాలతో కూడిన మహోన్నత పోరాటంగా నిలిచిందన్నారు.కేసీఆర్ పోరాటం నాలుగు కోట్ల ప్రజల చైతన్యం, తెలంగాణ ఉద్యమ చరిత్ర అనే భావనను మరోసారి ప్రజలు స్మరించుకుంటున్నారు అని ఆయ‌న తెలిపారు. చెరిపేస్తే చెరిగిపోని ఉద్యమ గాధ…చరిత్ర నుదిటిపై కాలమే చేసిన సంతకం కేసీఆర్ డిసెంబర్ 9 ఉద్యమ జ్వాల, ప్రజల సంకల్పం, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తుందని హ‌రీష్ రావు పేర్కొన్నారు.

విజయ్ దివస్ సందర్భంగా ఎర్రబెల్లి పాలాభిషేకం

కేసీఆర్ 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష ఫలంగా రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమమైన చారిత్రక రోజైన డిసెంబర్ 9ను ‘విజయ్ దివస్’గా గుర్తిస్తూ పర్వతగిరి మండల కేంద్రంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేసి, తరువాత డాక్టర్ బీఆర్అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. తెలంగాణ సాధనలో చేసిన త్యాగాలను, ఉద్యమ స్ఫూర్తిని స్మరించుకోవాలంటూ ఆయన పిలుపునిచ్చారు.