
తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త..పెండింగ్ బిల్లులన్నీ క్లియర్
రాష్ట్ర ప్రభుత్వం భారీ మొత్తంలో నిధులు విడుదల చేసి, ఉద్యోగులు, పంచాయతీరాజ్ శాఖ అలాగే ఆర్ అండ్ బి శాఖలకు పెద్ద ఊరట కల్పించింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ మొత్తం రూ.1,032 కోట్లు ఒకేసారి విడుదల చేసింది.
ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్‌కి రూ.712 కోట్లు
ఈ నిధులలో ప్రధాన భాగం ఉద్యోగుల బకాయిల క్లియరెన్స్‌కి రూ.712 కోట్లు కేటాయించారు. మిగతా రూ.320 కోట్లు పంచాయతీరాజ్,రహదారులు-భవనాల (ఆర్ అండ్ బి) శాఖలకు పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం విడుదలయ్యాయి.
ఆర్ అండ్ బి శాఖకు రూ.95 కోట్లు కేటాయించగా, వీటిలో 3,610 బిల్లులు (ప్రతి బిల్లు రూ.10 లక్షల లోపు) చెల్లింపులకు అవకాశం కల్పించారు. అదే విధంగా పంచాయతీరాజ్, గ్రామీణ స్థానిక సంస్థలకు రూ.225 కోట్లు విడుదల చేశారు. వీటితో 43,364 బిల్లులు క్లియర్ కానున్నాయి.ప్రభుత్వం తీసుకున్న ముఖ్య నిర్ణయం ప్రకారం, రూ.10 లక్షల లోపు ఉన్న అన్ని పెండింగ్ బిల్లులను పూర్తిగా క్లియర్ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీని ద్వారా గ్రామీణ అభివృద్ధి పనులు, రహదారి మరమ్మతులు, పంచాయతీ స్థాయిలో జరుగుతున్న ప్రాజెక్టులు వేగవంతం కానున్నాయి.
ఈ నిధుల విడుదలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు స్పందిస్తూ, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా, చిన్న కాంట్రాక్టర్లకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నాం అని అన్నారు.ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియాతో పాటు, సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ శాఖల బిల్లులు ఎప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్నాయి అంటే?
పంచాయతీరాజ్ అలాగే ఆర్ అండ్ బి శాఖల బిల్లులు 2024–25 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి (ఏప్రిల్ 2024 నుంచి) పెండింగ్‌లో ఉన్నాయి.
వర్షాకాలం, భారీ వర్షాల ప్రభావం, నిధుల విడుదలలో ఆలస్యం కారణంగా పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, రహదారులు & భవనాల శాఖలలో చిన్న, మధ్య స్థాయి కాంట్రాక్టర్లు సమర్పించిన బిల్లులు మూడునెలలకుపైగా చెల్లింపుల కోసం ఎదురు చూస్తున్నాయి.
ప్రత్యేకించి రూ.10 లక్షల లోపు ఉన్న చిన్న బిల్లులు గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు మరమ్మతులు, చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల పనులు వంటి ప్రాజెక్టులకు సంబంధించినవి. ఈ బిల్లులు చెల్లించకపోవడంతో గ్రామీణ అభివృద్ధి పనులు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది.ఇదే నేపథ్యంతో, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ఇప్పుడు ఈ పెండింగ్ బిల్లులన్నింటిని క్లియర్ చేసే దిశగా రూ.320 కోట్లు విడుదల చేసింది.
10 లక్షలపై ఉన్న పెండింగ్ బిల్లుల పరిస్థితి ఏమిటి?
ప్రస్తుతం ప్రభుత్వం రూ.10 లక్షల లోపు ఉన్న పెండింగ్ బిల్లులనే ప్రాధాన్యతగా క్లియర్ చేయాలని నిర్ణయించింది. అందువల్ల, రూ.10 లక్షల కంటే ఎక్కువ ఉన్న బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.ఆర్థిక శాఖ వర్గాల సమాచారం ప్రకారం, ప్రస్తుతం రాష్ట్ర ఖజానా నుంచి చిన్న బిల్లుల చెల్లింపులు పూర్తి అయిన తర్వాతే పెద్ద బిల్లుల చెల్లింపులపై దశలవారీగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఆర్థిక శాఖ వర్గాల ప్రాథమిక అంచనాల ప్రకారం నవంబర్ మధ్య నుంచి డిసెంబర్ మొదటి వారంలో పెద్ద బిల్లుల చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. పూర్తి చెల్లింపులు వచ్చే త్రైమాసికం (జనవరి 2026 నాటికి) పూర్తి అయ్యే అవకాశం.
