Let's talk: editor@tmv.in
తెలంగాణ ఈవీ వినియోగంలో దేశానికే ఆదర్శం కావాలి: మంత్రి పొన్నం

తెలంగాణ ఈవీ వినియోగంలో దేశానికే ఆదర్శం కావాలి: మంత్రి పొన్నం

Gaddamidi Naveen
7 జనవరి, 2026

విద్యుత్ వాహనాల (ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణను దేశానికి ఆదర్శ రాష్ట్రంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక చర్యలు చేపడుతోందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ, కాలుష్య నియంత్రణతో పాటు భవిష్యత్ తరాలకు పర్యావరణహిత రవాణా వ్యవస్థను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ప్రభుత్వ శాఖల కోసం కొనుగోలు చేసే వాహనాల్లో 25 నుంచి 50 శాతం వరకు ఈవీలను కొనుగోలు చేయాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంచడం, ఈవీ వినియోగాన్ని సాధారణ జీవనశైలిలో భాగం చేయడం ద్వారా తెలంగాణను ఈవీ విధానాల్లో దేశానికి రోల్‌మోడల్‌గా నిలపాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఆయన పేర్కొన్నారు.

ఈవీల కొనుగోలును మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులపై 100 శాతం మినహాయింపును అమలు చేస్తోందని మంత్రి గుర్తు చేశారు. ఈ విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాయని తెలిపారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో సుమారు లక్ష విద్యుత్ వాహనాలు అమ్ముడైనట్టు ఆయన వెల్లడించారు.

ఈవీ విధానాన్ని అమలు చేయడం వల్ల రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లుతున్నప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుందని మంత్రి స్పష్టం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈవీలు కొనుగోలు చేయడానికి కంపెనీలు 20 శాతం వరకు సబ్సిడీ ఇవ్వాలని కూడా ప్రభుత్వం సూచించిందని ఆయన తెలిపారు.

మౌలిక సదుపాయాల విస్తరణ

పాఠశాలలు, ఐటీ, ఫార్మా తదితర రంగాల సంస్థలు ఈవీలను స్వీకరించేలా ప్రోత్సహించే చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి ఈ-డ్రైవ్ పథకం కింద ప్రస్తుతం రాష్ట్రంలో 575 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, త్వరలో మరో 2,800 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే వాహన స్క్రాప్ విధానాన్ని అమలు చేస్తూ, పాత వాహనాలను రద్దు చేసుకునే వారికి ప్రోత్సాహకాలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఛార్జింగ్ మౌలిక వసతులను విస్తరించే దిశగా రెడ్కో ద్వారా గేటెడ్ కమ్యూనిటీలు, పర్యాటక ప్రాంతాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, జిల్లా కలెక్టరేట్లలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వివరించారు. ఈవీ స్వీకరణలో ప్రజలకు ఆదర్శంగా నిలవాలంటూ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో విద్యుత్ వాహనాలను ఉపయోగించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

37 ఆటోమేటిక్ టెస్టింగ్ సెంటర్లు

రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల సంఖ్య, కాలుష్యం, అగ్ని ప్రమాదాల నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని సంబంధిత మంత్రి పొన్నం వెల్లడించారు. ప్రస్తుతం తెలంగాణలో కోటి 80 లక్షల వాహనాలు ఉండగా, వాటి కాలుష్య నియంత్రణ కోసం 550 పొల్యూషన్ టెస్టింగ్ స్టేషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. కాలుష్య నియంత్రణను మరింత కచ్చితంగా అమలు చేసేందుకు ఆటోమేటిక్ వాహన పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, తొలి దశలో 15 స్టేషన్లు, మొత్తంగా 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఈ కేంద్రాల ద్వారా మానవ జోక్యం లేకుండా పారదర్శకంగా వాహనాల ఫిట్నెస్ పరీక్షలు జరుగుతాయని మంత్రి వివ‌రించారు.

వాహనాల ఫిట్‌నెస్

15 సంవత్సరాలు పైబడిన వాహనాలను స్క్రాప్ విధానంలోకి తీసుకువస్తున్నామని, ఇందులో ఆర్టీసీ వాహనాలు, ప్రభుత్వ వాహనాలు కూడా ఉంటాయని మంత్రి తెలిపారు. అయితే ప్రయాణికుల ప్రైవేట్ వాహనాలకు ప్రస్తుతం గ్రీన్ ట్యాక్స్ పేరిట కొంత వెసులుబాటు ఇవ్వడం జరుగుతోందని, ఈ వెసులుబాటు వల్ల కఠిన చర్యలు తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. ఈ అంశాన్ని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకెళ్లామని, ప్రైవేట్ వాహనాలపై వెసులుబాటు విషయంలో తుది నిర్ణయం కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉందని స్పష్టం చేశారు.

డ్రైవింగ్ లైసెన్సుల జారీలోనూ కచ్చితత్వం తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఢిల్లీలో మాదిరిగా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టింగ్ స్టేషన్లు ఇక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నామని మంత్రి చెప్పారు. ఎన్ఫోర్స్‌మెంట్‌ను మెరుగుపర్చేందుకు చెక్ పోస్టులు తొలగించి, సారథి, వాహన్ పోర్టల్స్‌లో పూర్తిగా అనుసంధానమయ్యామని వివరించారు. అలాగే స్పీడ్ లిమిట్ నియంత్రణ కోసం కెమెరాల ఏర్పాటును వేగవంతం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

హెచ్చరికలు, భద్రతా సూచనలు

హైదరాబాద్‌లో ముఖ్యంగా వాటర్ ట్యాంకర్ వాహనాల నుంచి వెలువడుతున్న పొగ కాలుష్యానికి కారణమవుతోందని, వాటర్ బోర్డుకు చెందిన వాహనాల ఫిట్నెస్‌పై నోటీసులు జారీ చేస్తామని మంత్రి చెప్పారు. అలాగే స్కూల్ బస్సులు, ఐటీ, ఫార్మా కంపెనీల వాహనాలు కాలుష్యానికి కారణమైతే వాటిపైనా చర్యలు తప్పవని హెచ్చరించారు.

అగ్ని ప్రమాదాల నివారణ - మౌలిక సదుపాయాలు

అగ్ని ప్రమాదాలపై మంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇటీవల 8,861 ఫైర్ యాక్సిడెంట్లు చోటు చేసుకోగా, వీటివల్ల రూ.879 కోట్ల ఆస్తి నష్టం, 163 మంది మృతి చెందినట్టు తెలిపారు. సంగారెడ్డి సమీపంలోని సిగాచి ఘటన, చార్మినార్ వద్ద ఒకే ఇంట్లో 17 మంది మృతి చెందిన అగ్ని ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగించాయని అన్నారు.

ప్రస్తుతం రాష్ట్రంలో 138 ఫైర్ స్టేషన్లు, 9 ఔట్‌పోస్టులు, 544 అగ్నిమాపక వాహనాలు ఉన్నాయని, తాజాగా 58 కొత్త ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. చర్ల, దేవరకద్ర, కల్లూరు, గుండాల, బోథ్, బయ్యారం, తూప్రాన్, పాశమైలారం, జిన్నారం, బీబీనగర్, బాచుపల్లి, ఘట్కేసర్ వంటి ప్రాంతాల్లో కొత్త కేంద్రాలు ప్రారంభించామని చెప్పారు. గౌలిగూడ, సికింద్రాబాద్, ఖైరతాబాద్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో ఫైర్ స్టేషన్ల స్థాయి పెంపు చేశామని తెలిపారు.

పెరుగుతున్న ఎత్తైన భవనాల నేపథ్యంలో 18 అంతస్తులు, 104 అంతస్తుల భవనాలకు అవసరమైన మిషనరీ ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. గేటెడ్ కమ్యూనిటీలు, ఆసుపత్రులు, పరిశ్రమలు, విద్యాసంస్థల్లో 13,658 ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు, ప్రమాదం జరిగితే ఎలా కాపాడుకోవాలో శిక్షణ ఇస్తున్నామని మంత్రి తెలిపారు.

విద్యుత్ లూస్ కేబుల్స్ వల్ల అగ్ని ప్రమాదాల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. ఫైర్ సేఫ్టీ సిబ్బంది నియామకాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆయన పేర్కొన్నారు.