
తెలంగాణ ఇంటర్ విద్యలో కీలక సంస్కరణలు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. విద్య శాఖ బాధ్యతలను సైతం పర్యవేక్షిస్తున్న సీఎం, ఇంటర్ బోర్డు పంపిన కీలక ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపారు. పారిశ్రామిక, కార్పొరేట్ అవసరాలకు అనుగుణంగా విద్యా విధానం ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యా విధానంలో ఈ కీలక సంస్కరణలు చేపట్టారు. ఈ సమూల మార్పులు వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుండి అమలులోకి రానున్నాయి.
ఇంటర్ విద్యలో రానున్న ప్రధాన మార్పులు ఇవే
ఫస్టియర్‌లోనూ ప్రాక్టికల్స్ (ప్రయోగ పరీక్షలు)
ఇప్పటివరకు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో కేవలం సెకండియర్‌లో మాత్రమే నిర్వహిస్తున్న ప్రాక్టికల్ పరీక్షలు ఇక నుంచి ఫస్టియర్‌లోనూ ప్రవేశపెడతారు. ప్రస్తుతం ఒక్కో సబ్జెక్టుకు కేటాయిస్తున్న 30 ప్రాక్టికల్ మార్కులను ఫస్టియర్, సెకండియర్ మధ్య సమానంగా విభజిస్తారు. ఉదాహరణకు ఎంపీసీ/బైపీసీ (ఫిజిక్స్/కెమిస్ట్రీ/బయాలజీ) ఫస్టియర్‌లో 15 మార్కులు, సెకండియర్‌లో 15 మార్కులకు ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. తొలి ఏడాది ల్యాబ్‌ల ముఖం చూడని విద్యార్థులు, ఏడాది నుంచే ప్రాక్టికల్ నాలెడ్జ్ పెంచుకోవడానికి ఇది దోహదపడుతుంది.
అన్ని సబ్జెక్టులకు ఇంటర్నల్ మార్కులు
ఇకపై ఇంటర్‌లో అన్ని సబ్జెక్టులకు 80:20 నిష్పత్తిలో మార్కులు కేటాయిస్తారు. 80 మార్కులు రాత పరీక్షకు (థియరీ), 20 మార్కులు అంతర్గత పరీక్షలకు (ఇంటర్నల్ అసెస్‌మెంట్) కేటాయిస్తారు. ప్రస్తుతం ఇంగ్లీష్ సబ్జెక్టుకు మాత్రమే ఇంటర్నల్ మార్కులు ఉండగా, ఇక నుంచి తెలుగు, సంస్కృతం, గణితం తదితర అన్ని సబ్జెక్టులకు ఈ అంతర్గత మార్కులు వర్తిస్తాయి.
కొత్త గ్రూప్ ఏసీఈ
అకౌంటెన్సీకి పెరుగుతున్న ప్రాధాన్యం దృష్ట్యా ఏసీఈ (అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్స్) సబ్జెక్టులతో కొత్త గ్రూప్‌ను అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. ప్రస్తుతం రాష్ట్రంలోని జూనియర్ కాలేజీల్లో సీఈసీ గ్రూపులో సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ ఉన్నాయి..
సిలబస్ తగ్గింపు, క్యూఆర్ కోడ్స్
గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం వంటి ఎంపీసీ సబ్జెక్టుల్లో సిలబస్‌ను తగ్గిస్తారు. ఎన్‌సీఈఆర్‌టీ ప్రమాణాలకు అనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేస్తారు. పాఠ్యపుస్తకాలపై క్యూఆర్ కోడ్ ముద్రించి విద్యార్థులు మరింత అదనపు సమాచారాన్ని సులభంగా తెలుసుకోవడానికి అవకాశం కల్పిస్తారు.
ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌లోనూ మార్పు*
వచ్చే విద్యా సంవత్సరం నుంచి కాకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేశారు. సెకండియర్ విద్యార్థులు ఎంసెట్, ఐఐటీ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు తగిన సమయం ఇచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
సాధారణంగా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే పరీక్షలు ఈసారి ఫిబ్రవరి చివరి వారం నుంచే మొదలుకానున్నాయి. ఫిబ్రవరి 25 నుంచి ప్రథమ సంవత్సరం, ఫిబ్రవరి 26 నుంచి ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమవుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు జనవరి చివరి వారంలో ప్రారంభమై, ఫిబ్రవరి మొదటి వారంలోగా పూర్తవుతాయి. కొత్తగా అమల్లోకి తీసుకొస్తున్న ఈ సంస్కరణలతో ఇంటర్ విద్య, భవిష్యత్ కెరీర్ కు ఉపయోగకరంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది.
