Let's talk: editor@tmv.in
తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల

Gaddamidi Naveen
13 ఏప్రిల్, 2026

తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యామండలి 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఆదివారం విడుదల చేసింది. ఈ ఏడాది కూడా బాలికలే పైచేయి సాధించగా, ప్రభుత్వ కళాశాలలు అద్భుతమైన ప్రతిభను కనబరిచాయి. మొత్తం 9.97 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకాగా, రాష్ట్రవ్యాప్తంగా 71 శాతం ఉత్తీర్ణత నమోదైంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు ఇంటర్ ఫలితాలను విడుదల చేస్తూ, విద్యార్థుల ప్రతిభ పట్ల హర్షం వ్యక్తం చేశారు. గత మూడేళ్లుగా ఫలితాలు నిలకడగా మెరుగుపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

మొత్తం 1495 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం ఇంటర్ పరీక్షల్లో 66.20 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, రెండో సంవత్సరం ఫలితాల్లో 70.58 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. లింగ పరంగా పరిశీలిస్తే, బాలికలు బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు. మొదటి సంవత్సరంలో బాలికల ఉత్తీర్ణత శాతం 74.40గా ఉండగా, బాలురది 57.69 శాతంగా నమోదైంది. రెండో సంవత్సరంలో కూడా ఇదే ధోరణి కొనసాగింది. బాలికలు 78.65 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత శాతం 62.50గా నిలిచింది. ఈ ఫలితాలు బాలికల విద్యా ప్రగతిని స్పష్టంగా ప్రతిబింబిస్తున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఫలితాలపై స్పందిస్తూ, ఈ ఏడాది ఫలితాలు ఎంతో ప్రేరణాత్మకంగా ఉన్నాయని పేర్కొన్నారు. ప్రతి ఏడాది ఉత్తీర్ణత శాతం పెరుగుతుండటం ఆనందదాయకమని, ముఖ్యంగా బాలికలు అద్భుతంగా రాణిస్తున్నారని అన్నారు. బాలురను నిరుత్సాహపరచాలనే ఉద్దేశ్యం లేదని, కానీ వాస్తవ పరిస్థితిని గుర్తించాల్సిన అవసరం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇక ప్రభుత్వ కళాశాలల ప్రదర్శన కూడా ఈసారి ప్రత్యేకంగా నిలిచింది. ప్రైవేట్ కళాశాలలతో పోలిస్తే ప్రభుత్వ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయని కేశవరావు వెల్లడించారు. ప్రభుత్వ కళాశాలలు తక్కువ స్థాయిలో ఉన్నాయని ప్రచారం జరుగుతున్నప్పటికీ, ఈ ఫలితాలు ఆ అభిప్రాయాన్ని తప్పు నిరూపించాయని అన్నారు.

ప్రభుత్వ కళాశాలల సత్తా

ప్రైవేట్ కళాశాలల కంటే ప్రభుత్వ కళాశాలలు తక్కువనే అపోహను ఈ ఫలితాలు చెదరగొట్టాయి.ముఖ్యంగా వొకేషనల్ స్ట్రీమ్‌లో ప్రభుత్వ కళాశాలలు 72శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రైవేట్ కళాశాలలు కేవలం 59శాతం వద్దే నిలిచాయి. మా వద్ద మౌలిక సదుపాయాలు తక్కువగా ఉండొచ్చు, కానీ విద్యాబోధన, ల్యాబ్ పనులు, ఉపాధ్యాయుల అంకితభావం విషయంలో మేము ప్రైవేట్ సంస్థల కంటే మెరుగ్గా ఉన్నాం అని ప్రభుత్వం గర్వంగా ప్రకటించింది. సుమారు 80శాతం మంది విద్యార్థులు ఫలితాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు.

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌..

విద్యార్థులు తమ మార్కులను అధికారిక వెబ్‌సైట్ల ద్వారా హాల్ టికెట్ నంబర్‌తో చూసుకోవచ్చు. ప్రస్తుతం విడుదలైనవి ప్రొవిజనల్ మార్కులే కాగా, అవసరమైతే రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు ఏప్రిల్ 13 నుంచి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల కోసం ఫీజు చెల్లింపునకు ఏప్రిల్‌ 13 నుంచి 20 వరకు అవకాశం ఇచ్చారు. మే 13 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమవుతాయి. రెండు సెషన్లలో ఈ పరీక్షలను నిర్వహిస్తారు. ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ ప్రాక్టికల్ పరీక్షలు మే 22 నుంచి మే 25 వరకు రెండు సెషన్లలో జరుగుతాయి.

తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల - Tholi Paluku