Let's talk: editor@tmv.in
తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర

తెలంగాణ ఆర్టీసీలో కొలువుల జాతర

Shaik Mohammad Shaffee
10 అక్టోబర్, 2025

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. సంస్థలో ఖాళీగా ఉన్న 1,743 డ్రైవర్, శ్రామిక్‌ (టెక్నికల్) పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు www.tgprb.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,743 కాగా.. ఇందులో డ్రైవర్‌ కొలువులు 1,000, శ్రామిక్‌ పోస్టులు 743 ఉన్నాయి. డ్రైవర్‌ పోస్టులకు కనీస విద్యార్హత పదో తరగతి. దీంతో పాటు 18 నెలలకు తక్కువ కాకుండా హెవీ ప్యాసింజర్‌ మోటారు వెహికిల్‌ లేదా హెవీ గూడ్స్‌ వెహికిల్‌ లేదా రవాణా వెహికిల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి. శ్రామిక్ పోస్టులకు ఐటీఐ ఉత్తీర్ణత తప్పనిసరి. డ్రైవర్‌ పోస్టులకు 22 ఏళ్ల నుంచి 35 ఏళ్ల వరకు, శ్రామిక్‌ ఉద్యోగాలకు 18 నుంచి 30 సంవత్సరాల వరకు వయోపరిమితి ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మూడేళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది.

డ్రైవర్‌ పోస్టులకు దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.300, శ్రామిక్‌ పోస్టులకు ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు రూ.200, జనరల్ అభ్యర్థులకు రూ.400గా ఉంది. అభ్యర్థులను ఫిజికల్ మెజర్‌మెంట్ (పీఎంటీ), మెడికల్, డ్రైవింగ్ టెస్ట్‌/ట్రేడ్ టెస్ట్‌ల ఆధారంగా ఎంపిక చేస్తారు. డ్రైవర్‌ ఉద్యోగాలకు రూ.20,960 నుండి రూ.60,080, శ్రామిక్‌ పోస్టులకు రూ.16,550 నుండి రూ.45,030 పేస్కేల్‌ ఉంటుంది. డ్రైవర్ పోస్టుల్లో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 148 పోస్టులు ఉన్నాయి. శ్రామిక్‌ పోస్టుల్లో అత్యధికంగా మెకానిక్ (డీజిల్, మోటార్‌ వెహికిల్‌) 589 పోస్టులున్నాయి. ఈ నియామక ప్రక్రియను తొలిసారిగా ఆర్టీసీ నుంచి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డుకు అప్పగించారు.

ఇన్నాళ్లకు నియామకాలు ఎందుకు?

ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ దాదాపు దశాబ్ద కాలంగా జరగలేదు. రాష్ట్రవ్యాప్తంగా డ్రైవర్లు, టెక్నీషియన్ల కొరత తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ అనేక డిపోలలో తాత్కాలిక డ్రైవర్లతో నెట్టుకొస్తోంది. పెరుగుతున్న బస్సుల సంఖ్య, నూతన విద్యుత్ బస్సుల (ఈవీ బస్సులు) ప్రవేశం, సంస్థలో పని చేస్తున్న సిబ్బంది రిటైర్మెంట్‌ల కారణంగా ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో గతేడాది ఆర్టీసీ 3,035 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపగా, తొలి దశలో 1,743 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. మిగిలిన పోస్టులు దశల వారీగా భర్తీ కానున్నాయి.

తెలంగాణ ఆర్టీసీలో కెరీర్, ప్రమోషన్లు

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో డ్రైవర్లు, శ్రామిక్‌లకు ఉద్యోగ భద్రతతో పాటు మెరుగైన కెరీర్ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. సాధారణంగా ఆర్టీసీలో డ్రైవర్‌గా చేరిన అభ్యర్థులు అనుభవం, పనితీరు ఆధారంగా డ్రైవర్-కమ్-కండక్టర్‌గా ప్రమోషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మరింత అనుభవం, నిర్దిష్ట అర్హతలను బట్టి సీనియర్ డ్రైవర్ గా లేదా సంస్థ పరిపాలనా విభాగాలలో పరిమిత అవకాశాలను పొందవచ్చు. సుదీర్ఘ అనుభవం, క్లీన్ రికార్డు ఉన్నవారికి మాత్రమే ఉన్నత స్థాయి ప్రమోషన్లు సాధ్యమవుతాయి.

టెక్నికల్ పోస్టులు అయిన శ్రామిక్‌లు (మెకానిక్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్ వంటివి) ఐటీఐ అర్హతతో సంస్థలో చేరతారు. వీరు అనుభవం ఆధారంగా తదుపరి స్థాయిలైన గ్రేడ్-II/గ్రేడ్-I మెకానిక్/ఫోర్‌మెన్‌ వంటి ప్రమోషన్లు పొందడానికి అవకాశం ఉంటుంది. సంస్థ టెక్నికల్ విభాగానికి పునాదిగా ఉన్న శ్రామిక్‌లకు శిక్షణ, అనుభవం ద్వారా వారి నైపుణ్యాన్ని పెంచుకొని కెరీర్‌లో ఎదగడానికి పుష్కలమైన అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుత నియామకాలు రెగ్యులర్ పోస్టులు కావడం వలన, సంస్థలో చేరే వారికి మంచి పేస్కేల్‌, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, పదవీ విరమణ ప్రయోజనాలు లభిస్తాయి. అయితే ఎస్సీ అభ్యర్థులు దరఖాస్తుతో పాటు, ధ్రువీకరణ పత్రాల పరిశీలన సమయంలో కొత్త ఫార్మాట్‌లో ఉన్న కుల ధ్రువీకరణ పత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలని బోర్డు చైర్మన్ వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://www.tgprb.in/లో ఉన్న నోటిఫికేషన్‌ను చదవండి.