Let's talk: editor@tmv.in
తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా: బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

తెలంగాణ అసెంబ్లీలో హైడ్రామా: బీఆర్ఎస్ సభ్యుల సస్పెన్షన్

Gaddamidi Naveen
30 మార్చి, 2026

తెలంగాణ శాసనసభ ఆదివారం తీవ్ర ఉత్కంఠకు, నిరసనలకు వేదికైంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిపై వస్తున్న అక్రమ మైనింగ్ ఆరోపణలపై 'హౌస్ కమిటీ' వేయాలంటూ పట్టుబట్టిన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ్యులపై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కఠిన చర్యలు తీసుకున్నారు. సభాపతి పదేపదే విజ్ఞప్తి చేసినప్పటికీ నిరసనలు ఆపకపోవడంతో, బీఆర్ఎస్ సభ్యులను ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు (రెండు రోజుల పాటు) సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ నేపథ్యంలో సభ ప్రారంభమైన వెంటనే బీఆర్ఎస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేశారు. మంత్రి పొంగులేటిపై విచారణ జరపాల్సిందేనని పట్టుబట్టారు. ఈ క్రమంలో సభ సజావుగా సాగడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం కావాలనే సభను అడ్డుకుంటోందని, ఇలాగైతే ప్రజా సమస్యలపై చర్చ జరగదని పేర్కొన్న సీఎం.. బీఆర్‌ఎస్ సభ్యులు తమ స్థానాల్లో కూర్చుని సభకు సహకరించాలనీ, లేకపోతే రెండు రోజుల పాటు సస్పెన్షన్‌కు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు.

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్‌ఎస్ సభ్యులను సస్పెండ్ చేయాలని స్పీకర్‌ను కోరగా, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన సస్పెన్షన్ తీర్మానాన్ని సభ ఆమోదించింది. దీంతో బీఆర్ఎస్ సభ్యులు ప్రస్తుత సెషన్ ముగిసే వరకు సభ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది. సిపిఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు కూడా సభకు ఆటంకం కలిగిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

పాడి కౌశిక్ రెడ్డిపై ఎథిక్స్ కమిటీ విచారణ

సభలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ రెబల్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అభ్యంతరకరమైన వ్యాఖ్య‌లు చేశారని కాంగ్రెస్ సభ్యులు మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి ప్రవర్తన అనైతికంగా, నిబంధనలకు విరుద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. సభ్యత్వం రద్దు చేయాలన్న డిమాండ్లు వచ్చినప్పటికీ, సీఎం జోక్యంతో ఈ వ్యవహారాన్ని నైతిక విలువలకు విరుద్ధంగా పరిగణిస్తూ ఎథిక్స్ కమిటీ కి బదిలీ చేస్తూ తీర్మానం చేశారు.

హరీష్ రావు బంధువులపై హౌస్ కమిటీ సవాల్

బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్ద బైఠాయించి నినాదాలు చేస్తున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షానికి ఒక సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్‌లో హరీష్ రావు సోదరుడు మహేష్ రావు ప్రైవేట్ పరిశ్రమ యజమానులను బెదిరించి, ధరణి పోర్టల్ ద్వారా వందల ఎకరాల భూమిని అక్రమంగా బదలాయించుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. హరీష్ రావు గనుక సిద్ధంగా ఉంటే, దీనిపై విచారణకు తక్షణమే 'హౌస్ కమిటీ' వేయడానికి మేము సిద్ధం అని ప్రకటించారు. అదేవిధంగా గత లోక్‌సభ ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య అంతర్గత అవగాహన ఉందని కూడా సీఎం ఆరోపించారు.

కీలక బిల్లుల ప్రవేశం

సభలో గందరగోళం నెలకొన్నప్పటికీ, ప్రభుత్వం తన శాసనపరమైన కార్యకలాపాలను కొనసాగించింది. మంత్రి శ్రీధర్ బాబు ‘తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటల్ సపోర్ట్ బిల్, 2026’ను సభలో ప్రవేశపెట్టారు. వృద్ధులైన తల్లిదండ్రులకు సామాజిక భద్రత కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని. స్పీకర్ దీనిపై చర్చకు అనుమతించారు.

సీబీ-సీఐడీ విచారణపై సీఎం స్పష్టత

ఇదిలా ఉండగా, శనివారం అసెంబ్లీలో జరిగిన సుదీర్ఘ చర్చను ప్రస్తావిస్తూ.. 2014 నుంచి తెలంగాణలో జరిగిన అన్ని మైనింగ్ లీజులు, అక్రమాలపై సీబీ-సీఐడీ విచారణకు ఆదేశించినట్లు సీఎం గుర్తు చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే పెద్ద ఎత్తున మైనింగ్ దోపిడీ జరిగిందని, ఆ అక్రమాలను వెలికితీసేందుకే ఈ సమగ్ర విచారణ అని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికి, మైనింగ్, భూ అక్రమాల చుట్టూ తిరుగుతున్న ఈ వివాదం తెలంగాణ అసెంబ్లీని రణరంగంగా మార్చేసింది. ప్రతిపక్షం లేకుండానే సభలో చర్చలు కొనసాగుతుండటం గమనార్హం.