Let's talk: editor@tmv.in
తెలంగాణ అసెంబ్లీలో ‘హేట్ స్పీచ్’ బిల్లుపై వెనక్కి తగ్గిన ప్ర‌భుత్వం

తెలంగాణ అసెంబ్లీలో ‘హేట్ స్పీచ్’ బిల్లుపై వెనక్కి తగ్గిన ప్ర‌భుత్వం

Gaddamidi Naveen
31 మార్చి, 2026

తెలంగాణ శాసనసభలో అత్యంత చర్చనీయాంశంగా మారిన ‘తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ బిల్లు’ను రాష్ట్ర ప్రభుత్వం సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసింది. విద్వేష ప్రసంగాలు, నేరాలను అరికట్టే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ.. ప్రతిపక్ష బీజేపీ, ఎంఐఎం, సీపీఐ సహా అధికార కాంగ్రెస్ సభ్యులు కూడా కొన్ని నిబంధనలపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ముఖ్యమంత్రి తరఫున రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ సభలో ప్రవేశపెట్టారు.

ముఖ్యమంత్రి తరపున ఈ బిల్లుపై చర్చకు సమాధానమిచ్చిన రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, విద్వేష ప్రసంగాలను అరికట్టేందుకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవడం లేదని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా డిజిటల్, సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేషం వేగంగా వ్యాపిస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తోందని, దీనిని నియంత్రించేందుకే ఈ చట్టం అవసరమని పేర్కొన్నారు. అయితే, ఈ బిల్లు పౌర హక్కులకు గానీ, వాక్ స్వాతంత్ర్యానికి గానీ భంగం కలిగించేలా లేదని ఆయన అన్నారు. సమగ్ర పరిశీలన కోసం దీనిని సెలెక్ట్ కమిటీకి పంపాలని ఆయనే ప్రతిపాదించారు. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. సెలెక్ట్ కమిటీలో సభ్యుల సంఖ్య, నియామకంపై నిర్ణయం తీసుకునే అధికారాన్ని స్పీకర్‌కు అప్పగిస్తూ తీర్మానం ప్రవేశపెట్టారు, దీనిని సభ ఆమోదించింది.

సభలో వ్యక్తమైన అభ్యంతరాలు

బిల్లులోని లోపాలపై వివిధ పార్టీల సభ్యులు తమ గళాన్ని వినిపించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏ. మహేశ్వర్ రెడ్డి ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. హేట్ స్పీచ్ అనే పదానికి సరైన నిర్వచనం లేదని, ఇది ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కేలా ఉందని ఆరోపించారు. అరెస్టు అయిన వ్యక్తే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలన్న నిబంధన ప్రమాదకరమని, అధికారంలో ఉన్నవారు రాజకీయ కక్షసాధింపులకు దీనిని వాడుకునే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా మాట్లాడుతూ, మత ప్రచారం ఈ చట్టం పరిధిలోకి రాకూడదని కోరారు. ఇప్పటికే బిఎన్ఎస్ లో తగిన నిబంధనలు ఉన్నాయని గుర్తు చేస్తూ, బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని మద్దతు తెలిపారు. సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు ఒక కీలక అంశాన్ని లేవనెత్తారు. సంస్థలో ఒక్క సభ్యుడు తప్పుగా మాట్లాడితే మొత్తం సంస్థపై కేసు నమోదు చేసే నిబంధన సరికాదని, దీనిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఎం. రాగమయి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న విద్వేష ప్రచారాన్ని అంగీకరిస్తూనే, బిల్లును మరింత మెరుగుపరిచేందుకు కమిటీకి పంపడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు.

సమాజంలో సామరస్యాన్ని పెంపొందించడం, వ్యక్తులు లేదా సంస్థల పట్ల ద్వేషాన్ని చిమ్మే చర్యలను అరికట్టడం ఈ బిల్లు ప్రధాన లక్ష్యం. అయితే, చట్టంలోని నిబంధనలు దుర్వినియోగం కాకుండా ఉండాలని అన్ని పక్షాలు కోరడంతో, సెలెక్ట్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే ఈ బిల్లుపై తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. అప్పటి వరకు విద్వేష ప్రసంగాల నియంత్రణపై చర్చలు కొనసాగుతూనే ఉంటాయి.

ప్రజాస్వామ్య గొంతు నొక్కేందుకే ఈ బిల్లు కేటీఆర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హేట్ స్పీచ్ బిల్లుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ బిల్లును పౌర స్వేచ్ఛను హరించే ఒక ‘క్రూరమైన ఆయుధం’గా ఆయన అభివర్ణించారు. విమర్శకుల నోళ్లు మూయించేందుకే ప్రభుత్వం ఇటువంటి నిరంకుశ చట్టాలను తెస్తోందని మండిపడ్డారు.

బిల్లులోని నిబంధనలు అత్యంత అస్పష్టంగా ఉన్నాయని, ఇది అధికారుల వ్యక్తిగత అభిప్రాయాల ప్రకారం దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉందని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. వ్యతిరేక భావాలు ప్రేరేపించడం వంటి పదజాలాన్ని ఉపయోగించి ప్రభుత్వం తన వైఫల్యాలను ఎండగట్టే ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే దేశంలో తగినన్ని చట్టాలు ఉండగా, అదనంగా ఈ చట్టం తీసుకురావడం వెనుక ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలని, వెంటనే ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.