Let's talk: editor@tmv.in
తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శం: మంత్రి పొంగులేటి

తెలంగాణ అభివృద్ధి దేశానికే ఆదర్శం: మంత్రి పొంగులేటి

Gaddamidi Naveen
3 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో సంక్షేమం అభివృద్ధి రంగాల్లో మార్పు కనిపిస్తోందని, ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని రెండేళ్లలోనే నిలబెట్టుకున్నామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.

వ్యవసాయం, విద్య, వైద్యం, గృహనిర్మాణం, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఉపాధి కల్పన వంటి కీలక రంగాల్లో ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలుపుతున్నాయని మంత్రి తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన విధానాలు నేరుగా ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయని ఆయన అన్నారు.

ఈ మార్పులను ప్రజలకు సమర్థవంతంగా చేరవేయడంలో సమాచార–పౌరసంబంధాల శాఖ పాత్ర అత్యంత కీలకమని మంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తూ, ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వేగవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమాచార శాఖ అధికారులకు ఆయన సూచించారు. ఈ క్రమంలోనే సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆధునీకరించిన సమాచార, పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న ప్రతి నిర్ణయం సామాన్యుడి జీవితంలో మార్పుకు నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాప్రభుత్వ పాలన రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టింది. రెండేళ్ల కాలం తక్కువే అయినప్పటికీ, ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఇందిరమ్మ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఆరు గ్యారంటీల అమలుకు శ్రీకారం చుట్టాం. ఎన్నికల సమయంలో హామీ ఇవ్వకపోయినా, ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేశాం అని అన్నారు.

వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగాల్లో గణనీయమైన ప్రగతిని రాష్ట్రం సాధిస్తున్నదని మంత్రి వివరించారు. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణ ముందంజలో ఉందని, ఆర్థిక వృద్ధి పరంగా కూడా రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు. రైతులకు మద్దతు, యువతకు ఉపాధి అవకాశాలు, పేదలకు గృహనిర్మాణం వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన దిశతో ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలోనూ అగ్రస్థానంలో నిలిపేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో “తెలంగాణ రైజింగ్–2047” విజన్‌తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. దీర్ఘకాలిక అభివృద్ధి లక్ష్యాలతో రూపొందించిన ఈ విజన్ భవిష్యత్ తరాలకు బలమైన తెలంగాణను అందిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్ సి.హెచ్. ప్రియాంక, సీఎం సీపీఆర్‌వో జి. మల్సూర్, సమాచార శాఖ అడిషనల్ డైరెక్టర్ డి.ఎస్. జగన్, జాయింట్ డైరెక్టర్ రమణతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.