Let's talk: editor@tmv.in
తెలంగాణా లో దీపావళి టపాసుల బాధితులు

తెలంగాణా లో దీపావళి టపాసుల బాధితులు

Dantu Vijaya Lakshmi Prasanna
22 అక్టోబర్, 2025

దీపావళి సందర్భంగా తెలంగాణ అగ్నిమాపక శాఖకు మొత్తం 44 అత్యవసర అగ్నిమాపక కాల్స్ వచ్చాయి. పండుగ సందర్బంగా ఈ పెరుగుదల మరింత స్పష్టంగా కనిపిస్తోంది. అత్యంత ముఖ్యమైన అగ్ని ప్రమాదం సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలోని అరీన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్లో జరిగింది. అగ్నిమాపక సిబ్బంది తక్షణమే స్పందించారు. ఇప్పటికే మెహదీపట్నం సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి 50 మందికి పైగా చిన్న చిన్న సంఘటనలలో ప్రమాదాలకు గురైన అగ్ని ప్రమాద బాదితులు చేరుకున్నారని వారిలో 10 మంది చిన్న పిల్లలున్నారని సమాచారం . అందరకి మెరుగైన చికిత్స అందిస్తున్నారని,ఎటువంటి ప్రాణాపాయం ఇప్పటివరకు లేదని అధికారవర్గాలు ఒక ప్రకటనలో వెల్లడించాయి

దీపావళి రోజు సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం సంగుపేట గ్రామ శివారులో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కటకం వేణుగోపాల్ అండ్ సన్స్ హోల్ సేల్ అండ్ రిటైల్ టపాసుల దుకాణంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. టపాసుల ప్యాకింగ్ పేపర్ల వ్యర్థాల్లో ప్రమాదవశాత్తు నిప్పురవ్వ పడి మంటలు చెలరేగాయి. గోదాం ఆవరణలో ఏర్పాటు చేసిన హోల్‌సేల్ అండ్ రిటైల్ దుకాణాలకు మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పాటు దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.కోటి విలువైన టపాసులు కాలిపోయాయని ఫైర్ సిబ్బంది ప్రాథమికంగా అంచనా వేశారు.

మరొక ఘటనలో హైదరాబాద్ పాతబస్తీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బహదూర్‌పురా చౌరస్తా సమీపంలోని ఒక స్క్రాప్ గోదాంలో మంటలు ఎగిసిపడటంతో పరిసర ప్రాంతంలో ఒకింత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీపావళి సందర్భంగా కాల్చిన బాణసంచా మంటలే ఈ ప్రమాదానికి కారణమై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం కొంత ఊరటనిచ్చింది. కానీ ఆస్తి నష్టం మాత్రం కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.అయితే గోదాంలో చెక్క క్యాబినెట్‌లు, ప్లాస్టిక్, పేపర్, ఇనుము వంటి దహన పదార్థాలు ఎక్కువగా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో పక్కనే ఉన్న ఆర్కే టవర్ నివాసితులు భయాందోళనకు గురయ్యారు. సమీప ఇళ్లలోని వారిని తాత్కాలికంగా ఖాళీ చేయించి.. విద్యుత్ సరఫరా నిలిపివేశారు. కాగా సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, జి హెచ్ ఎమ్ సి అగ్నిమాపక సిబ్బంది, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మూడు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు: దాదాపు గంటన్నర పాటు కొనసాగిన ప్రయత్నాల తర్వాత మూడు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే గోదాంలోని పెద్ద మొత్తంలో స్క్రాప్ సామగ్రి పూర్తిగా దగ్ధమైపోయిందని అంటున్నారు. అలానే గోదాం బయట పార్క్ చేసిన జీప్, కారు కూడా పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల చెబుతున్న సమాచారం మేరకు.. సమీపంలో రాత్రంతా బాణసంచా కాల్చడం జరిగిందన్నారు. తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మంటలు చెలరేగాయని చెబుతున్నారు. ఇక ప్రమాదానికి గల కారణాన్ని నిర్ధారించేందుకు బహదూర్‌పురా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గోదాం యజమానిని, స్థానికులను విచారిస్తున్నారు. దీపావళి వంటి పండుగల్లో టపాసులు కాల్చేటప్పుడు మరింత జాగ్రత్త వహించాలని అధికారులు సూచిస్తున్నా, ఖాళీ ప్రదేశాల్లో, దహన పదార్థాలు లేని ప్రాంగణాల్లో మాత్రమే టపాసులు కాల్చాలని హెచ్చరించిన ఎక్కడో ఒకచోట ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి అంటున్నారు అధికారులు.

అధికారిక ప్రకటన: ఒక అగ్నిమాపక అధికారి తమ కాల్ సెంటర్ కు 44 కాల్స్ వచ్చినట్లు, వాటిలో అరీన్ లైఫ్ సైన్సెస్ వద్ద జరిగిన సంఘటన ముఖ్యమైనదని ధృవీకరించారు. మంటలను నియంత్రించామని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలిపారు. అరీన్ లైఫ్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది చురుకైన ఫార్మాస్యూటికల్ పదార్థాలు ఇంటర్మీడియట్లను తయారుచేసే సంస్థ. ఇటువంటి పరిశ్రమలలో తరచుగా మండే రసాయనాలతో పని చేయవలసి ఉంటుంది, కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో ఇంత పెద్ద అగ్నిప్రమాదం జరగడానికి ఇదే కారణంగా చెప్పవచ్చు.సదాశివపేట, సంగారెడ్డి నుండి రెండు ఫైర్ వాహనాలను సంఘటన స్థలానికి పంపాము .అగ్నిప్రమాదాన్ని అగ్నిమాపక బృందాలు విజయవంతంగా అదుపులోకి తెచ్చాయి. ప్రధాన అగ్నిప్రమాదంలో కానీ, మొత్తం 44 సంఘటనలలో కానీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు అని అన్నారు.