
తెలంగాణాలో రవాణా చెక్కుపోస్టుల తొలగింపు- సుపరిపాలనలో ఒక ముందడుగు
తెలంగాణ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న ఒక నిర్ణయం రాష్ట్ర రవాణా రంగ చరిత్రలో ఒక గొప్ప నిర్ణయం. సామాన్య ప్రజల జీవితాలను నేరుగా ప్రభావితం చేసే రవాణా రంగంలో ఎన్నో దశాబ్దాలుగా కొనసాగిన ఒక అవినీతి మూలానికి చెక్ పెట్టిన ఈ చర్యను తప్పకుండా స్వాగతించాలి ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ట్రాన్స్‌పోర్ట్ చెక్కుపోస్టులు రద్దు అయ్యాయి. ఈ నిర్ణయం కేవలం పరిపాలనా మార్పు మాత్రమే కాదు. ఇది లారీ డ్రైవరు వంటి సామాన్య ప్రజానీకానికి గొప్ప ఉపశమనం.
అవినీతి అడ్డాలకు ముగింపు
ఒకప్పుడు చెక్కుపోస్టులు వాహన పత్రాలు, పన్నులు, ఓవర్లోడింగ్ తనిఖీలకు అవసరమని చెప్పబడింది. కానీ కాలక్రమేణా అవి తమ అసలు ఉద్దేశాన్ని కోల్పోయి లంచాల కేంద్రాలుగా మారాయి. వాహన డ్రైవర్లను వేధించడం, అనవసర వసూళ్లు, అప్రామాణిక బెదిరింపులు రోజువారీ సన్నివేశాలుగా మారాయి. ఈ దృశ్యాలు దేశమంతటా రోడ్లపై సాధారణమైపోయాయి. ఇటీవల అవినీతి నిరోధక శాఖ (ACB) దాడుల్లో బయటపడ్డ లక్షల రూపాయల నగదు, ఆ అధికారుల చేతుల్లో లభించిన అక్రమ వసూళ్ల రికార్డులు — ఈ వ్యవస్థ ఎంతగా కుళ్లిపోయిందో నిరూపించాయి.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం రెండు నెలల క్రితం జారీ చేసిన జి.ఓ. 58 ప్రకారం అన్ని చెక్కుపోస్టులను మూసివేయాలని నిర్ణయించడం రవాణా రంగమే కాక ,వాణిజ్య రంగం లో కూడా సంస్కరణలలో ఒక గణనీయమైన ముందడుగు. అక్టోబర్‌లో 22 న ఉత్తర్వు అమల్లోకి రాగానే చెక్కుపోస్టుల వద్ద బ్యారికేడ్లు తొలగించి, సిబ్బందిని ఇతర శాఖలకు పంపివేసింది
సంస్కరణ వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశాలు
1. అవినీతి నిర్మూలన: చెక్కుపోస్టుల వద్ద ఉన్న ఉద్యోగుల చేతివాటమే అవినీతికి మూలం. అక్కడ విధుల్లో ఉన్న సిబ్బంది ద్వారా లంచాల వ్యవస్థ బలపడింది. ఆ వ్యవస్థనే తొలగించడంతో అక్కడ అవినీతి కూడా పోతుంది. ఇది భవిష్యత్తులో ఇతర శాఖలకు కూడా మార్గదర్శకం కావచ్చు.
2. డిజిటల్ పాలన వైపు అడుగు: ఈ నిర్ణయం తెలంగాణను డిజిటల్ పరిపాలన దిశగా మరింత ముందుకు నడిపింది. ఇప్పటికే వాహన్, సారథి వంటి జాతీయ డేటాబేస్‌ల ద్వారా వాహనాలు, డ్రైవింగ్ లైసెన్సులు, పన్ను వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇందువల్ల భౌతిక తనిఖీల అవసరం తగ్గిపోతోంది. తెలంగాణ ఈ వాస్తవాన్ని గుర్తించి సాంకేతిక మార్పును ఆచరణలోకి తెచ్చింది.
3. రవాణా సామర్థ్యము పెంపు: చెక్కుపోస్టుల వద్ద వాహనాలు నిలిచి ఉండటం వల్ల రవాణా సమయనష్టం, ఇంధన వ్యయం, సరుకు ఆలస్యాలు అనివార్యం అయ్యేవి. ప్రతి చెక్కుపోస్టు డ్రైవర్‌లకు ఇబ్బంది, వ్యాపారులకు నష్టం. ఇప్పుడు ఆ అడ్డంకులు తొలగిపోవడంతో రవాణా వేగం పెరిగి, వ్యాపార సౌలభ్యం పెరుగుతుంది. ఈ మార్పు పరిశ్రమలకు మేలు చేస్తుంది.
4. పరిపాలనా సరళీకరణ: చెక్కుపోస్టుల నిర్వహణ కోసం ప్రభుత్వం సిబ్బంది, భవనాలు, వాహనాలు, పరికరాలు వంటి వనరులను ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ భారం తొలగింది. ఇదే సిబ్బంది ఇప్పుడు మానిటరింగ్, డేటా విశ్లేషణ వంటి ఆధునిక బాధ్యతల్లో వినియోగించబడవచ్చు. ఈ మార్పు పరిపాలనా సామర్థ్యాన్ని పెంచుతుంది.
ఈ నిర్ణయంతో కలిగే ప్రయోజనాలు
డ్రైవర్లకు ఊరట: ఇకపై డ్రైవర్లు భయంతో చెక్కుపోస్టుల వద్ద ఆగాల్సిన అవసరం లేదు. వారి ప్రయాణం వేధింపులు లేకుండా సాగుతుంది.
వ్యాపారాలకు ప్రోత్సాహం: రవాణా వేగం పెరిగి సరుకు సమయానికి చేరడం వల్ల వ్యాపార ఖర్చులు తగ్గుతాయి. పరిశ్రమల ఉత్పత్తి చక్రం వేగంగా తిరుగుతుంది.వ్యాపార వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న పరిణామమిది . అంతర్జాతీయ ఎగుమతులకు కూడా ఇది అనుకూలం.
ప్రభుత్వానికి గౌరవం: సాధారణ పౌరుడికి దశాబ్దాలుగా ప్రభుత్వ వ్యవస్థపై పేరుకుపోయిన అవిశ్వాసం కొంత వరకైనా తగ్గి , ప్రభుత్వ ప్రతిష్ఠ పెరిగే అవకాశం ఉంది.
సాంకేతిక పర్యవేక్షణ: ఇకపై కేవలం చెక్కుపోస్టు గేట్లపై ఆధారపడకుండా, కెమెరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఆటోమేటెడ్ సెన్సార్ల ద్వారా వాహనాల పర్యవేక్షణ సాధ్యమవుతుంది. ఇది మరింత పారదర్శకమైన వ్యవస్థకు మార్గం చూపుతుంది.ఇతర శాఖలతో సమన్వయం సులభ్యమవుతుంది.
ప్రమాదాలు తగ్గే అవకాశం
చెక్ పోస్టుల వద్ద జరిగే ఆలస్యాన్ని పూడ్చడానికి డ్రైవరు ఎక్కువ వేగంతో ప్రయాణించి ప్రమాదాలు తెచ్చుకుంటున్నారు. చెక్ పోస్టుల రద్దు వల్ల అటువంటి ప్రమాదాలు తగ్గుతాయి, సవాళ్లు మరియు పరిష్కారాలు
ప్రతి సంస్కరణకు సవాళ్లు తప్పవు. అందుకు చెక్కుపోస్టుల రద్దు నిర్ణయం కూడా మినహాయింపు కాదు.
కొంతమంది నిపుణులు పన్ను ఎగవేతలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవానికి ఎక్కువ ఉల్లంఘనలు ఉద్యోగులు ఉన్న పాత వ్యవస్థ చెక్కుపోస్టుల వద్దే జరిగేవి. డిజిటల్ మానిటరింగ్, ఆటోమేటెడ్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్, ర్యాండమ్ మొబైల్ తనిఖీలు వంటి ఆధునిక పద్ధతులు పన్ను వసూళ్లను మరింత కట్టుదిట్టంగా చేయగలవు. కాకపోతే సరైన టెక్నాలజీ వ్యవస్థ ,దానిని సరిగా అమలుచేయడం ముఖ్యం. మరొక సవాలు పొరుగు రాష్ట్రాల సమన్వయం. తెలంగాణ చెక్కుపోస్టులు తీసివేసినా, పొరుగు రాష్ట్రాలలో అవి కొనసాగితే ప్రయోజనం పరిమితమవుతుంది. అందుకే ఈ మోడల్‌ను దేశవ్యాప్తంగా అనుసరించాల్సిన అవసరం ఉంది. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ దీనిని దేశస్థాయిలో పరిశీలించి ,అమలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.
ఒక నూతన పాలనా విధానం
చెక్కుపోస్టుల తొలగింపు కేవలం రవాణా సౌలభ్యం కోసం తీసుకున్న చర్య కాదు. ఇది ప్రభుత్వ పాలనా విధానంపై సామాన్యుడు నమ్మకం కోల్పోయిన విలువల పునరుద్ధరణలో ఒక ముందడుగు. ప్రజలు అవినీతి లేని పాలనను కోరుకుంటున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.తెలంగాణ చూపించిన ఈ మార్గం ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా ఉండాలి. డిజిటల్ పద్ధతులు, ఆటోమేటెడ్ పర్యవేక్షణ, పారదర్శక పన్ను వ్యవస్థలు ఇవన్నీ భారత రవాణా రంగాన్ని ఆధునీకరించడానికి కీలకం. ఈ మార్పు దేశవ్యాప్తంగా అమలైతే సరుకు రవాణా వేగం, వ్యాపార సౌలభ్యం, ప్రభుత్వ నమ్మకం అన్నీ కలసి అభివృద్ధికి కొత్త మార్గాలు తెరుస్తాయి. రవాణా వ్యవస్థలో మాత్రమే కాక , మిగిలిన ప్రభుత్వ వ్యవస్థలలో కూడా అనవసరమైన ,అవినీతిమయమైన పోస్టులను తొలగించి, సుపరిపాలన సాగుతుందని ఆశిద్దాము
