Let's talk: editor@tmv.in
తెలంగాణలో 74 లక్షల ఓట్లు తగ్గే అవకాశం.. నేటితో ముగియనున్న‘ఎస్‌ఐఆర్’

తెలంగాణలో 74 లక్షల ఓట్లు తగ్గే అవకాశం.. నేటితో ముగియనున్న‘ఎస్‌ఐఆర్’

Gaddamidi Naveen
10 ఆగస్టు, 2026

తెలంగాణలో సుమారు 74 లక్షల ఓట్లు తగ్గనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు గడువు (సోమవారం) నేటితో ముగియనుంది. అయితే ఇప్పటివరకు 20 శాతానికి పైగా ఎన్యూమరేషన్‌ ఫారాలు తిరిగి రాకపోవడంతో ఎన్నికల సంఘం అప్రమత్తమైంది. ఫారాలు అందజేయని ఓటర్లు వెంటనే సమర్పించాలని, ఎన్యూమరేషన్‌ పూర్తి కానివారు నేడు సంబంధిత బీఎల్‌వోలను సంప్రదించాలని అధికారులు సూచించారు.

ప్రస్తుత ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 3,38,26,448 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు 2,64,11,118 మంది ఎన్యూమరేషన్‌ ఫారాలను డిజిటలైజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన ఫారాలు అందకపోవడంతో ఎస్‌ఐఆర్‌ పూర్తయిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 శాతం ఓట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరణించినవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, డూప్లికేట్‌ ఓట్లు వంటి వాటిని తొలగించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో రాష్ట్రంలో సుమారు 74 లక్షల ఓట్లు తగ్గే పరిస్థితి కనిపిస్తుండగా, హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ పరిధిలో ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. అక్కడ దాదాపు 40 శాతం వరకు ఓట్లు తగ్గే అవకాశం ఉందని అంచనా. ఎస్‌ఐఆర్‌ అనంతరం ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి సెప్టెంబర్‌ 16 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. నోటీసులు జారీ చేసి, క్లెయిమ్‌లు, అభ్యంతరాల పరిష్కార ప్రక్రియ అక్టోబర్‌ 15 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించనుంది.