
తెలంగాణలో 47 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
రాష్ట్రంలో త్వరలో జరగనున్న మున్సిపల్ సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ పరిపాలన విభాగంలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, నిష్పక్షపాత విధానాన్ని అనుసరించాలన్న ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు.. రాష్ట్రవ్యాప్తంగా వివిధ హోదాల్లో పనిచేస్తున్న 47 మంది మున్సిపల్ కమిషనర్లు, అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో.ఆర్టీ.నెం.87 ఉత్తర్వులు జారీ చేసింది. సొంత జిల్లాల్లో పనిచేస్తున్న వారు, సుదీర్ఘ కాలంగా ఒకే చోట ఉన్న వారిని ప్రాధాన్యత క్రమంలో మార్చినట్లు ప్రభుత్వం పేర్కొంది.
ఎన్నికల మార్గదర్శకాలే ప్రాతిపదిక
రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టరేట్ కార్యాలయం విడుదల చేసిన ఈ ఉత్తర్వుల ప్రకారం, బదిలీ అయిన అధికారులందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది. విధుల్లో చేరడంలో జాప్యం చేస్తే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ముఖ్యంగా గ్రేడ్-1, గ్రేడ్-2, గ్రేడ్-3 స్థాయి కమిషనర్లతో పాటు స్పెషల్ గ్రేడ్ అధికారులను కూడా పరిపాలనా పరమైన అవసరాల దృష్ట్యా బదిలీ చేశారు.
కీలక మున్సిపాలిటీల్లో కొత్త కమిషనర్లు
ఈ ఉత్తర్వుల ప్రకారం ఆదిలాబాద్, మంచిర్యాల, నల్గొండ, మహబూబ్‌నగర్, వికారాబాద్, జహీరాబాద్ వంటి ప్రధాన మున్సిపాలిటీల్లో కొత్త కమిషనర్లు బాధ్యతలు చేపట్టనున్నారు. మరికొందరు అధికారులను జీహెచ్‌ఎంసీకి, మెప్మా కార్యాలయాలకు, సచివాలయానికి బదిలీ చేశారు. ఇతర విభాగాల్లో డిప్యూటేషన్‌పై ఉన్న అధికారులకు కూడా వారి మాతృ సంస్థల్లో స్పష్టమైన పోస్టింగ్‌లు ఇచ్చారు.
పదోన్నతులతో కూడిన నియామకాలు
ఈ బదిలీ ప్రక్రియలో కేవలం స్థానచలనం మాత్రమే కాకుండా, అర్హత కలిగిన అధికారులకు పదోన్నతులు కూడా కల్పించారు. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేనేజర్లు, ఎంపీఓలు, ఎంపీడీఓలుగా ఉన్న అధికారులకు మున్సిపల్ కమిషనర్లుగా బాధ్యతలు అప్పగించారు. అలాగే స్పెషల్ గ్రేడ్, సెలెక్షన్ గ్రేడ్ కమిషనర్ల హోదా కలిగిన వారికి వారి సీనియారిటీకి తగ్గట్టుగా కీలక బాధ్యతలు కేటాయించారు.
సత్వర అమలుకు ఆదేశాలు
ఈ బదిలీల ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ కార్యదర్శి డాక్టర్ టి.కె. శ్రీదేవి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన నివేదికలను వెంటనే ప్రభుత్వానికి పంపాలని కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. ఎన్నికల వేళ యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న ఉద్దేశంతోనే ఈ భారీ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు?
ఇటీవల జరిగిన రాష్ట్ర క్యాబినెట్ భేటీలో ఫిబ్రవరి నెలలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి రెండో వారంలో లేదా ఆ తర్వాత పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓటర్ల జాబితాల తయారీ, రవాణా ఏర్పాట్లు ఇప్పటికే ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ జనవరి 24-27 తేదీల మధ్య వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద ఫిబ్రవరిలోనే పురపోరు ముగిసేలా ఆటు ప్రభుత్వం, ఇటు ఎన్నికల యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతున్నట్లు సమాచారం.
