Let's talk: editor@tmv.in
తెలంగాణలో 'హేట్ స్పీచ్' చట్టంపై రగడ: కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ అధ్యక్షుడు ధ్వజం

తెలంగాణలో 'హేట్ స్పీచ్' చట్టంపై రగడ: కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ అధ్యక్షుడు ధ్వజం

Gaddamidi Naveen
23 డిసెంబర్, 2025

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న యాంటీ,హేట్ స్పీచ్ (ద్వేషపూరిత వ్యాఖ్యల నిరోధక) చట్టాన్ని బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ చట్టం ప్రజాహితానికి కాకుండా, రాష్ట్రంలో బీజేపీని అణచివేయడానికే తీసుకువస్తున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ఆరోపించారు.

సోమవారం విడుదల చేసిన వీడియో ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, ద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నది కాంగ్రెస్ నేతలేనని, ముఖ్యంగా హిందూ దేవతలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని అన్నారు. అలాంటి వ్యాఖ్యలపై మాత్రం చర్యలు తీసుకోకుండా, బీజేపీ నేతలు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకునేందుకే ఈ చట్టాన్ని తీసుకురావాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని ఆయ‌న‌ విమర్శించారు.

ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి చేసిన కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలంటే కాంగ్రెస్ అనే వ్యాఖ్యను ఉదహరిస్తూ, ఇలాంటి వ్యాఖ్యలు ద్వేష ప్రసంగం కిందకు రావా? అని రాంచందర్ రావు ప్రశ్నించారు. అలాంటి మాటలు సామాజిక విభేదాలకు దారి తీస్తాయని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని సమర్థిస్తున్నదని ఆయన ఆరోపించారు.

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన యాంటీ,హేట్ స్పీచ్ బిల్లును ఉదాహరణగా ప్రస్తావించిన రాంచందర్ రావు, ఆ బిల్లు రూపకల్పననే బీజేపీ కార్యకర్తలనువేధించేందుకు, నేతలను లక్ష్యంగా చేసుకునేందుకు తయారు చేసినట్టుగా ఉందన్నారు. అదే తరహాలో తెలంగాణలోను చట్టం తీసుకురావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఈ యాంటీ,హేట్ స్పీచ్ చట్టాన్ని బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదు. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం.స్వేచ్ఛా భావప్రకటన హక్కును హరించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. బీజేపీని అణచివేయాలనే ఉద్దేశంతోనే ఈ చట్టం తెస్తున్నారని మరోసారి ఆయ‌న‌ ఆరోపించారు.

ఇదిలా ఉండగా, రెండు సంవత్సరాలుగా ప్రజా కార్యక్రమాలకు దూరంగా ఉన్న బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ఒక సమావేశంలో పాల్గొని, అనంతరం ప్రెస్‌మీట్ నిర్వహించడంపై కూడా రాంచందర్ రావు స్పందించారు. కేసీఆర్ తిరిగి ప్రజల్లోకి రావడం వల్ల తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పు ఉండబోదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది ఓటీపీ, వన్ టైం పాస్‌వర్డ్ లాంటిది. ఒకసారి వస్తుంది, వెంటనే మరిచిపోతారు. కొంతకాలానికి మరో ఓటీపీ వస్తుంది. ప్రజలు ఇప్పటికే బీఆర్ఎస్‌ను మరిచిపోయారు. ఆ పార్టీ చేసిన అవినీతి పనులనే ప్రజలు ఇప్పటికీ గుర్తు పెట్టుకున్నారు అని రాంచందర్ రావు వ్యాఖ్యానించారు.

తెలంగాణలో 'హేట్ స్పీచ్' చట్టంపై రగడ: కాంగ్రెస్ సర్కార్‌పై బీజేపీ అధ్యక్షుడు ధ్వజం - Tholi Paluku