
తెలంగాణలో స్తంభించిన ఆటోలు: మీటర్ చార్జీల పెంపు, ఓలా-ఉబర్ నిషేధం కోసం భారీ సమ్మె
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షాల సమ్మె ఉధృతంగా కొనసాగింది. రాష్ట్ర ఆటో యూనియన్ల జేఏసీ పిలుపు మేరకు డ్రైవర్లు విధులను బహిష్కరించి నిరసనల్లో పాల్గొన్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్, అసెంబ్లీ పరిసరాలు, ప్రధాన కూడళ్లలో ఆటోలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తమ చిరకాల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఆటో డ్రైవర్ల పొట్ట కొట్టేలా ఉన్న విధానాలను మార్చుకోవాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ సమ్మెలో ప్రధానంగా మీటర్ చార్జీల సవరణ అంశం తెరపైకి వచ్చింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా కనీస మీటర్ చార్జీలను తక్షణమే పెంచాలని డ్రైవర్లు కోరుతున్నారు. చాలా ఏళ్లుగా చార్జీల పెంపు లేకపోవడంతో తాము ఆర్థికంగా కుంగిపోతున్నామని, నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో పాత చార్జీలతో ఆటోలు నడపడం సాధ్యం కాదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరో కీలక డిమాండ్ ఓలా, ఉబర్, రాపిడో వంటి యాప్ ఆధారిత సేవలపై నిషేధం. అక్రమంగా నడుస్తున్న బైక్ టాక్సీలు,ప్రైవేట్ వాహనాల వల్ల తమ ఉపాధి దెబ్బతింటోందని ఆటో యూనియన్లు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా రాపిడో వంటి సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా వైట్ బోర్డు వాహనాలను వాణిజ్య అవసరాలకు వాడుతున్నాయని, దీనివల్ల లైసెన్స్ ఉన్న ఆటో డ్రైవర్లకు గిరాకీలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేదా పూర్తిగా నిషేధించాలని పట్టుబడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహనాల చట్టం (ఎమ్ వి యాక్ట్) 2019 తాజా అగ్రిగేటర్ మార్గదర్శకాలను కూడా యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. భారీ జరిమానాలు, కఠినమైన నిబంధనలు సామాన్య డ్రైవర్లకు భారంగా మారాయని వారు పేర్కొంటున్నారు. తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫారమ్ వర్కర్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ మాట్లాడుతూ, ప్రభుత్వం కనీస ధరలను నిర్ణయించకుండా కంపెనీలకు ఇష్టారాజ్యంగా వదిలేసిందని, దీనివల్ల గిగ్ వర్కర్లు, ఆటో డ్రైవర్లు దోపిడీకి గురవుతున్నారని విమర్శించారు.
గురువారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగిన ఈ సమ్మెలో భాగంగా సుధా రియా పార్క్ నుండి ఎన్టీఆర్ స్టేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం స్పందించి చర్చలకు పిలవకపోతే మున్ముందు సమ్మెను మరింత ఉధృతం చేస్తామని యూనియన్ నాయకులు హెచ్చరించారు. ఈ లోపు రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విద్యాసంస్థల వద్ద ఆటోలు అందుబాటులో లేకపోవడంతో సామాన్య ప్రజలు మెట్రో బస్సులపై ఆధారపడాల్సి వచ్చింది.
