Let's talk: editor@tmv.in
తెలంగాణలో 'సర్' ఏప్రిల్‌ లేదా మేలో షెడ్యూల్

తెలంగాణలో 'సర్' ఏప్రిల్‌ లేదా మేలో షెడ్యూల్

Gaddamidi Naveen
7 ఫిబ్రవరి, 2026

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స‌ర్) ప్రక్రియను ఈ ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో చేపట్టే అవకాశం ఉందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి. సుదర్శన్ రెడ్డి తెలిపారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలోని 12 రాష్ట్రాల్లో స‌ర్ కొనసాగుతుండగా, మిగిలిన రాష్ట్రాల షెడ్యూల్‌ను త్వరలో ప్రకటించే అవకాశముందని చెప్పారు.

స‌ర్ ప్రక్రియ ప్రారంభానికి ముందే రాష్ట్రంలో ప్రాథమిక ఏర్పాట్లు ప్రారంభించినట్లు సీఈఓ తెలిపారు. ఒకసారి షెడ్యూల్ విడుదలైన తర్వాత సవరణ ప్రక్రియకు సమయం పరిమితంగా ఉండే అవకాశమున్నందున ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల జాబితాల సవరణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమన్వయం కోసం బూత్ స్థాయిలో రాజకీయ పార్టీల భాగస్వామ్యం కీలకమని ఆయన అన్నారు.

ప్రతి పోలింగ్ కేంద్రానికి కనీసం ఒక బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ)ను రాజకీయ పార్టీలు నియమించాలని సుదర్శన్ రెడ్డి సూచించారు. బీఎల్ఏలు సాధ్యమైనంతవరకు ఆ పోలింగ్ కేంద్ర పరిధిలోనే నివసించే వ్యక్తులై ఉండాలని, వారు బూత్ లెవల్ అధికారులతో (బీఎల్ఓలు) సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. బూత్ స్థాయిలో బలమైన సమన్వయం ఉంటే ఓటరు జాబితాల సవరణ ప్రక్రియ సజావుగా సాగుతుందని, ఫిర్యాదులు తగ్గే అవకాశముంటుందని ఆయన వివరించారు.

స‌ర్ సమయంలో బీఎల్ఓలు ప్రతి పోలింగ్ ప్రాంతాన్ని మూడు నుంచి నాలుగు సార్లు సందర్శించనున్నారని తెలిపారు. మొదటి సందర్శనలో గణన (ఎన్యూమరేషన్) ఫారాలను పంపిణీ చేస్తారు. తరువాతి సందర్శనల్లో ముందుగా అందుబాటులో లేని గృహాలను తిరిగి సందర్శించి వివరాలు సేకరిస్తారు. ప్రాథమిక దశలో గుర్తించబడని ఓటర్లు కూడా స‌ర్ సమయంలో తమ వివరాలను సమర్పించుకునే అవకాశం ఉంటుందని సీఈఓ స్పష్టం చేశారు.

అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చూడడం ఎన్నికల శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. బీఎల్ఏల నియామకం త్వరితగతిన పూర్తి చేస్తే సవరణ ప్రక్రియ సమర్థవంతంగా సాగుతుందని, సమస్యలు తక్కువగా ఎదురవుతాయని తెలిపారు. ఓటరు జాబితాల ఖచ్చితత్వం ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడేందుకు ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ సమావేశంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వాసం వెంకటేశ్వర్ రెడ్డి, డిప్యూటీ సీఈఓ హరి సింగ్‌తో పాటు ఇతర ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.

తెలంగాణలో 'సర్' ఏప్రిల్‌ లేదా మేలో షెడ్యూల్ - Tholi Paluku