Let's talk: editor@tmv.in
తెలంగాణలో సర్పంచ్‌లకు ప్రభుత్వం కొత్త కీలక అధికారాలు

తెలంగాణలో సర్పంచ్‌లకు ప్రభుత్వం కొత్త కీలక అధికారాలు

Gaddamidi Naveen
10 ఫిబ్రవరి, 2026

తెలంగాణలో గ్రామ స్థాయిలో అంగన్‌వాడీ సేవలను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, సేవల నిర్వహణలో పారదర్శకత పెంచడం, అక్రమాలను అరికట్టడం ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం పేర్కొంది.

ఇకపై ప్రతి గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించేందుకు సర్పంచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. ఈ కమిటీకి సర్పంచ్ ఛైర్మన్‌గా వ్యవహరించనుండగా, మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. అంగన్‌వాడీ టీచర్ కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అదనంగా ఏఎన్‌ఎం, పాఠశాల సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు తదితరులు సభ్యులుగా ఉంటారు. గ్రామ స్థాయిలో అన్ని వర్గాల ప్రతినిధులు భాగస్వామ్యం కావడం ద్వారా సేవల నాణ్యత మెరుగుపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కమిటీ ప్రతి నెలా అంగన్‌వాడీ కేంద్రాలకు అందుతున్న బియ్యం, పప్పులు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి పోషకాహార సరుకుల నాణ్యతను పరిశీలించనుంది. అలాగే వాటి సరైన పంపిణీ జరుగుతున్నదా లేదా అనే విషయాన్ని కూడా తనిఖీ చేస్తుంది. ఆరోగ్యలక్ష్మి పథకం కింద గర్భిణులు, బాలింతలకు అందిస్తున్న భోజనాన్ని కూడా సమీక్షించి, లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో ప్రయోజనం అందేలా చర్యలు తీసుకోనుంది.

గత రెండేళ్లపాటు గ్రామాల్లో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడం వల్ల అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణలో లోపాలు చోటుచేసుకున్నాయని ప్రభుత్వం గుర్తించిందని స‌మాచారం. కొన్ని ప్రాంతాల్లో పౌష్టికాహారం సరైన విధంగా లబ్ధిదారులకు చేరకపోవడం వంటి సమస్యలు వెలుగులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇటీవల కొత్త పంచాయతీ పాలకవర్గాలు ఏర్పడిన నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా పర్యవేక్షణ బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొత్తంగా ఈ నిర్ణయం ద్వారా గ్రామాల్లో పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పోషకాహారం సమయానికి, నాణ్యంగా అందేలా చూడటం, అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును మెరుగుపరచడం లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

పర్యవేక్షణ లోపాలే ప్రధాన కారణం!

తెలంగాణలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో గత రెండేళ్లుగా గ్రామ పంచాయతీలలో ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణ బలహీనపడిందని ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఈ కాలంలో అంగన్‌వాడీల్లో ఎంత స్థాయిలో అక్రమాలు జరిగాయి అనే అంశంపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక గణాంకాలు లేదా నివేదిక విడుదల చేయలేదు. పెద్ద స్థాయి అవినీతి జరిగినట్లు కూడా అధికారికంగా ప్రకటించలేదు.

అయినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో పోషకాహారం నాణ్యతపై ఫిర్యాదులు రావడం, పాడైన గుడ్లు పంపిణీ వంటి సంఘటనలు వెలుగులోకి రావడం, సరఫరా ప్రక్రియలో అంతరాయాలు ఏర్పడటం వంటి సమస్యలు గుర్తించబడ్డాయి. అధికారులు కాలానుగుణంగా తనిఖీలు చేసినప్పటికీ, గ్రామ స్థాయిలో రోజువారీ పర్యవేక్షణ లేకపోవడం వల్ల నిర్వహణ లోపాలు పెరిగినట్లు ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీ సేవలు మెరుగుపడేందుకు స్థానిక ప్రజాప్రతినిధుల భాగస్వామ్యాన్ని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది.