
తెలంగాణలో ష్నైడర్ ఎలక్ట్రిక్ విస్తరణ
ప్రఖ్యాత బహుళజాతి సంస్థ ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా తెలంగాణలో తన కార్యకలాపాలను మరింతగా విస్తరించనున్నట్లు ప్రకటించింది. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక – 2026 సదస్సు సందర్భంగా, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందం, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా సీఈఓ దీపక్ శర్మతో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విస్తరణలో భాగంగా, సంస్థ రూ.623 కోట్ల పెట్టుబడితో తెలంగాణలోని తన ప్రస్తుత యూనిట్లను విస్తరించనుంది. ముఖ్యంగా గాగిల్లాపూర్, శంషాబాద్ ప్రాంతాల్లో ఉన్న తయారీ కేంద్రాల సామర్థ్యాన్ని పెంచనున్నారు. సమావేశంలో విద్యుత్ రంగంలో సంస్కరణలు, ఎనర్జీ ట్రాన్సిషన్, విద్యుత్ నిల్వ (ఎనర్జీ స్టోరేజ్) ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్య పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతుల కోసం డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది. విస్తరణ అనంతరం, ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు (ఏసీబీ), మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు (ఎంసీసీబీ), కాంటాక్టర్లు, పుష్ బటన్లు వంటి ముఖ్యమైన ఎలక్ట్రికల్ భద్రతా ఉత్పత్తుల తయారీ సామర్థ్యం గణనీయంగా పెరగనుంది.
ఈ సందర్భంగా తెలంగాణకు పెట్టుబడులను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్న పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కృషిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. 2047 నాటికి నెట్-జీరో లక్ష్యాల సాధనలో సుస్థిర అభివృద్ధి (సస్టైనబిలిటీ) కీలకమైనదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా సీఈఓ దీపక్ శర్మ మాట్లాడుతూ, తెలంగాణలో సంస్థ ఇప్పటికే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను నిర్వహిస్తోందని తెలిపారు. ముఖ్యంగా ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ ఆటోమేషన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ రంగాల్లో యువతకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వివరించారు. ఈ పెట్టుబడితో తెలంగాణ రాష్ట్రం పచ్చదనం, సాంకేతికత, పరిశ్రమల అభివృద్ధి దిశగా మరింత బలంగా ముందుకు సాగనుందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
